హైదరాబాద్ లో వైరల్ ఫీవర్స్.. దవాఖానలకు జనాల క్యూ

హైదరాబాద్ లో వైరల్ ఫీవర్స్.. దవాఖానలకు జనాల క్యూ
  •     వాతావరణ మార్పులతో  రోగాల బారిన..
  •     పెరుగుతున్న గవద బిళ్లల కేసులు
  •     పిల్లలు, మహిళలు, వృద్ధులే ఎక్కువగా బాధితులు 

హైదరాబాద్​, వెలుగు:  సిటీలో వైరల్​ ఫీవర్స్​, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, గవదబిళ్లల సమస్యలతో జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.  వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్​ ఫీవర్స్​ విజృంభిస్తుండగా చిన్నా, పెద్దా అంద రూ రోగాల బారిన పడుతున్నారు.   ప్రధాన హాస్పిటల్స్ అయిన ఫీవర్​, గాంధీ, ఉస్మానియాలో రోజుకు సగటున 300 నుంచి 500 లకు పైగా ఓపీలు నమోదవుతున్నాయి. మరోవైపు  పిల్లలు, పెద్దలపై గవదబిళ్లలు(మంప్స్​)  పంజా విసురుతోంది. ప్రస్తుతం రెట్టింపు కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వీటితో పాటు చికెన్​ ఫాక్స్​, తట్టు, డిఫ్తీరియా, డయేరియా, రేబిస్​ కేసులు కూడా వస్తున్నట్టు పేర్కొంటున్నారు. 

విజృంభిస్తోన్న గవద బిళ్లలు 

నెల రోజులుగా గవద బిళ్లల కేసులు పెరుగుతుండగా.. ఫీవర్​ ఆస్పత్రికి రోజుకు 20 నుంచి 25 కేసులు వస్తున్నాయి.  వారం రోజుల్లోనే 15 మంది చేరారు. సాధారణంగా మంప్స్​ ఎఫెక్ట్ 2 –11 ఏండ్లలోపు  పిల్లలపై ఎక్కువగా ఉంటుంది, ప్రస్తుతం పెద్దలపై కూడా మంప్స్​ పంజా విసురుతుంది. తినేటప్పుడు నోరు నొప్పిగా ఉండడం, వాంతులు, ఒళ్లు నొప్పులు, జ్వరం, ఆకలి మందగించడం, మగవాళ్లలో వృషణాల వాపు తదితర లక్షణాలు కనిపిస్తాయని, ముందస్తుగా గుర్తించి చికిత్సకు సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కాగా, గవద బిళ్లలు వచ్చిన వారికి మళ్లీ రాదు. ఇది జీవితకాలం రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. 

వీరే ఎక్కువగా ఆస్పత్రులకు.. 

కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా జర్వం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితో హాస్పిటల్స్​ కు వస్తుండగా... పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారు.  ఫీవర్ ​హాస్పిటల్​లో రోజుకు 300 నుంచి 400 ఓపీలు నమోదు అయ్యేవి. వారం రోజుల నుంచి వరుసగా 623, 580, 572, 543, 569, 233, 508 ఓపీలు నమోదవుతూ వస్తున్నాయి.  మంగళవారం ఫీవర్​ హాస్పిటల్​లో476 , ఉస్మానియాలో హాస్పిటల్​లో 464 , గాంధీలో 345 ఓపీలు నమోదయ్యాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 

జాగ్రత్తగా ఉండాలి 

సీజనల్​ ఫీవర్స్​ తో  ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. గవద బిళ్లలు ఉమ్ము, తుంపిర్ల ద్వారా వ్యాపిస్తుంది. దీనికి ప్రత్యేకమైన ట్రీట్​మెంట్ ​ఏమీలేదు. మెడిసిన్​ వాడుతూ వ్యక్తిగత దూరం, శుభ్రత పాటించాలి. గవద బిళ్లలు సోకిన పిల్లలను స్కూలుకు, ఆటలకు పంపించొద్దు. ఇవి  వారం రోజుల్లో తగ్గుముఖం పడతాయి. 
– డాక్టర్ కొండల్​ రెడ్డి,  ఫీవర్​ హాస్పిటల్​