ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారించాలి: విరసం రాష్ట్ర నేత పినాక పాణి

ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారించాలి: విరసం రాష్ట్ర నేత పినాక పాణి
  • జాడి వెంకటి సంతాప సభలో విరసం రాష్ట్ర నేత పినాక పాణి

బెల్లంపల్లి, వెలుగు: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో ఎన్ కౌంటర్లలో ఇప్పటివరకు 685 మంది విప్లవకారులను కేంద్ర ప్రభుత్వం కాల్చిచంపిందని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పినాక పాణి ఆరోపించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జాడి వెంకటి సంస్మరణ సభ బుధవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దండకారణ్యంలో లక్షల కోట్ల విలువైన మైన్స్​ను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకే మావోయిస్టులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కక్షగట్టారని మండిపడ్డారు. 

పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు పద్మకుమారి, శాంతక్క, మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మహ్మద్ హుస్సేన్ మాట్లాడారు. గాయాబంద్​ఎన్​కౌంటర్​తో పాటు ఇటీవల జరిగిన కడారి సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి ఎన్​కౌంటర్ల పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జాడి వెంకటి వంటి విప్లవ కారులను చంపినంతమాత్రాన విప్లవోద్యమాన్ని ఆపలేరన్నారు. సభలో వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. జాడి వెంకటి ఫొటోకు ఆయన కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.