T20 వరల్డ్ కప్ టాప్ స్కోరర్ గా కోహ్లీ

 T20 వరల్డ్ కప్ టాప్ స్కోరర్ గా కోహ్లీ

అడిలైడ్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో రికార్డులను నెలకొల్పిన కోహ్లీ... ఇవాళ బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ లో ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తన వ్యక్తిగత స్కోర్ 16 వద్ద... ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అంతకుముందు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దనే (1016) పేరిట ఉండేది. ప్రస్తుతం ఆ రికార్డ్ ను కోహ్లీ అధిగమించాడు. 2014 టీ20 వరల్డ్ కప్ లో 319 పరుగులు సాధించి కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు.  అదేవిధంగా 2016 టీ20 వరల్డ్ కప్ లో 273 పరుగులు చేసి రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇవాళ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 62 పరుగులు సాధించి భారత్ కు భారీ స్కోర్ ను అందించాడు. ఈ వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో పాకిస్తాన్ తో భారత్ తలపడగా... విరాట్ 82 పరుగుల వీరోచిత బ్యాటింగ్ తో థ్రిల్లింగ్ విక్టరీ వరించింది. తర్వాత నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లీ 62 రన్స్ చేశాడు.