
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతో పాటు..తన మార్కు కామెడీతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ..ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ను ఉత్తేజ పరుస్తుంటాడు. ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
కోహ్లీ నాటు డ్యాన్స్..
ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వన్డేలో కోహ్లీ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో కోహ్లీ నాటు నాటు స్టెప్పులేశాడు. కోహ్లీ నాటు నాటు డ్యాన్స్ కెమెరాల్లో కనిపించింది. దీంతో ఈ వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై స్పందించిన ట్రిపుల్ ఆర్ టీమ్.. కోహ్లీని ట్యాగ్ చేస్తూ లవ్ ఎమోజీలతో రీట్వీట్ చేసింది. కోహ్లీ నాటు నాటు స్టెప్పులకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
గతంలోనూ..
కోహ్లీ డ్యాన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేక పాటలకు మైదానంలో స్టెప్పులేశాడు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ సమయంలో జడేజాతో కలిసి 'పఠాన్' పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో కూడా అప్పట్లో తెగ వైరల్ అయింది.
టీమిండియా విక్టరీ..
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్లతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ 3 వికెట్ల చొప్పన తీశారు. జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసి గెలిచింది.