ఐపీఎల్‌‌ 16లో ఆర్‌‌సీబీ బోణీ

 ఐపీఎల్‌‌ 16లో ఆర్‌‌సీబీ బోణీ

బెంగళూరు: టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో కింగ్‌‌ కోహ్లీ (49 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 నాటౌట్‌‌), డు ప్లెసిస్‌‌ (43 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73) దంచికొట్టడంతో.. ఐపీఎల్‌‌–16లో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్‌‌సీబీ) బోణీ చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్​పై గెలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. తిలక్‌‌ వర్మ (46 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్‌‌) చెలరేగగా, నేహాల్‌‌ వదేరా (21) ఫర్వాలేదనిపించాడు. స్టార్టింగ్‌‌లో ఆర్‌‌సీబీ బౌలర్లు చెలరేగడంతో.. ముంబై బ్యాటర్లు 48 రన్స్‌‌కే రోహిత్‌‌ (1), ఇషాన్‌‌ కిషన్‌‌ (10), గ్రీన్‌‌ (5), సూర్యకుమార్‌‌ (15) ఔటయ్యారు. ఈ దశలో తిలక్‌‌ ఇన్నింగ్స్‌‌ చివరి వరకు నిలబడ్డాడు. నేహాల్‌‌తో ఐదో వికెట్‌‌కు 50 రన్స్‌‌ జత చేశాడు. దీంతో పవర్‌‌ప్లేలో 29/3 స్కోరుతో ఉన్న ముంబై.. 14 ఓవర్లలో 100 రన్స్‌‌కు చేరుకుంది. చివర్లో టిమ్‌‌ డేవిడ్‌‌ (4), హ్రితిక్‌‌ షోకెన్‌‌ (5), అర్షద్‌‌ ఖాన్‌‌ (15 నాటౌట్‌‌) ఫెయిలైనా తిలక్‌‌ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తర్వాత బెంగళూరు 16.2 ఓవర్లలో 172/2 స్కోరు చేసి గెలిచింది.

తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన కోహ్లీ–డుప్లెసిస్‌‌.. థర్డ్‌‌ ఓవర్‌‌ నుంచి ఊచకోత కోశారు. ఈ ఓవర్‌‌లో డుప్లీ 2 సిక్స్‌‌లు, ఓ ఫోర్‌‌ కొడితే, తర్వాతి ఓవర్‌‌లో విరాట్‌‌ 6, 4తో చెలరేగాడు. దీంతో పవర్‌‌ప్లేలో ఆర్‌‌సీబీ 53/0తో ముందుకెళ్లింది. 8వ ఓవర్‌‌లో 4, 4, 6తో 17 రన్స్‌‌ రాబట్టిన డుప్లెసిస్‌‌.. పదో ఓవర్‌‌లో రెండు సిక్సర్లతో మరో 17 రన్స్‌‌ పిండుకున్నాడు. ఫలితంగా ఫస్ట్‌‌ టెన్‌‌లో ఆర్‌‌సీబీ 97/0తో నిలిచింది. తర్వాత కోహ్లీ మూడు సిక్స్‌‌లు, ఓ ఫోర్‌‌ బాదితే, డుప్లెసిస్‌‌ 6, 4తో తొలి వికెట్‌‌కు 148 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. ఆ వెంటనే దినేశ్‌‌ కార్తీక్‌‌ (0) డకౌటైనా.. మ్యాక్స్‌‌వెల్‌‌ (12 నాటౌట్‌‌) రెండు సిక్సర్లు, కోహ్లీ సిక్స్‌‌, ఫోర్‌‌తో విజయాన్ని అందించారు. డు ప్లెసిస్‌‌కి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.