బెంగళూర్-గుజరాత్ మ్యాచ్లో సరదా సన్నివేశం.. గిల్ను గేలి చేసిన కోహ్లీ.. వీడియో వైరల్

బెంగళూర్-గుజరాత్ మ్యాచ్లో సరదా సన్నివేశం.. గిల్ను గేలి చేసిన కోహ్లీ.. వీడియో వైరల్

వండే, టెస్టు, టీ20, ఐపీఎల్.. ఫార్మాట్ ఏదైనా సరే.. కింగ్ కోహ్లీ ఎంత సరదాగా.. ఎంత స్పోర్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఒకవైపు సీరియస్ గా ఆడుతూనే.. మరోవైపు సహచర ప్లేయర్లతో కామెడీ పండించడంలో విరాట్ తర్వాతే ఎవరైనా.  లేటెస్టుగా.. 2026 ఐపీఎల్ లో భాగంగా .. గురువారం (ఏప్రిల్ 30)  అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన బెంగళూర్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో విరాట్ చేసిన కామెడీ వీడియో వైరల్ గా మారింది. 

గుజరాత్ బ్యాటింగ్ సందర్భంగా.. గిల్ ను ఔట్ చేసిన తర్వాత కోహ్లీ గేలి చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఎక్ట్రా కవర్ మీదుగా ఆడేందుకు ట్రై చేసి గిల్ ను కోహ్లీ క్యాచ్ ఔట్ చేశాడు. 

అయితే గిల్ డగౌట్ లో కూర్చుని ఉండగా.. క్యాచ్ ఔట్ ఎలా చేశానో చూశావా.. అన్నట్లుగా కోహ్లీ వెక్కిరించినట్లుగా గేలి చేశాడు. దీనికి గిల్ రిప్లై గా.. స్కోర్ బోర్డు చూడు.. ఎక్కడా ఆగటం లేదు.. అన్నట్లుగా స్క్రీన్ వైపు చూపించాడు. గుజరాత్ గెలుస్తుంది అన్నట్లుగా గిల్ సైగ చేశాడు. అయినా కోహ్లీ తగ్గకుండా.. ఔట్ అయిన సందర్భంగా వికెట్స్ మధ్య గిల్ పరిగెత్తేందుకు ఇబ్బంది పడినట్లుగా.. చూపిస్తూ హేళన చేశాడు. ఆ తర్వాత గిల్.. ఎలాంటి రిప్లై ఇవ్వకుండా అలా నవ్వుతూ సైలెంట్ గా కూర్చుని ఉండిపోయాడు. 

ఇక ఐపీఎల్‌‌–19లో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు విజయాలకు గుజరాత్‌‌ టైటాన్స్‌‌ చెక్‌‌ పెట్టింది. ఛేజింగ్‌‌లో కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (18 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 43), జోస్‌‌ బట్లర్‌‌ (19 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 39) ధనాధన్‌‌ షాట్లతో చెలరేగడంతో.. గురువారం జరిగిన లో స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో గుజరాత్‌‌ 4 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలిచింది. 

టాస్‌‌ ఓడిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 రన్స్‌‌కే ఆలౌటైంది. దేవదత్‌‌ పడిక్కల్‌‌ (24 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 40) టాప్‌‌ స్కోరర్‌‌. కోహ్లీ (28)తో సహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత గుజరాత్‌‌ 15.5 ఓవర్లలో 158/6 స్కోరు చేసి నెగ్గింది. హోల్డర్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.