తప్పుడు కథనాలను ఖండించిన విశాక ఇండస్ట్రీస్

తప్పుడు కథనాలను ఖండించిన విశాక ఇండస్ట్రీస్

విశాక ఇండస్ట్రీస్ లిమిలెడ్ లావాదేవీలపై తప్పుడు ప్రచారాన్ని కంపెనీ యాజమాన్యం ఖండించింది . టీఆర్ఎస్ కు చెందిన టీవీ, పేపర్ లో రాజకీయ దురుద్దేశంతో కథనాలు రాశారని విశాక మేనేజ్ మెంట్ తెలిపింది. కంపెనీ చైర్మన్ వివేకానంద్ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేశారని యాజమాన్యం చెప్పింది. కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ కోసం భూమిని 2020 నుంచే చూస్తున్నామని.. 2020 ఆగస్టులో బోర్డు అనుమతితో జాగా ఫైనల్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చామని యాజమాన్యం తెలిపింది. దీనికి సంబంధించిన టీడీఎస్ కూడా ఐటీకి చెల్లించామని క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది లావాదేవీలు జరిగాయి కాబట్టి.. వచ్చే ఏడాదిలో  వివరాలుంటాయని స్పష్టం చేసింది. 

గతేడాది బ్యాలన్స్ షీట్ల  వివరాలు చెప్పలేదంటూ కథనాలు రాయడం విడ్డూరంగా ఉందని విశాక మేనేజ్ మెంట్ తెలిపింది . కార్పొరేట్ అవసరాల కోసం ఇచ్చే షార్ట్ టర్మ్ లోన్లను బ్యాలన్స్ షీట్ లోనే వివరించామని చెప్పింది. అధికారికంగా వెల్లడించిన లావాదేవీలపై కూడా అనుమానాలు వచ్చేలా తప్పుడు ప్రచారం చేయడాన్ని కంపెనీ ఖండించింది. విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం తీసుకునే ప్రతి నిర్ణయం బోర్డు అనుమతితోనే జరుగుతుందని స్పష్టం చేసింది. విశాక లావాదేవీలన్నీ కార్పొరేట్ మినిస్ట్రీకి ఫైల్ చేస్తామని,  లిస్టెడ్ కంపెనీ కాబట్టి లావాదేవీలన్నింటిపై ఆడిట్ ఉంటుందని వివరించింది. కంపెనీకి సంబంధించిన లావాదేవీలన్నీ స్టాక్ ఎక్సేంజీలో ఉన్నాయని తెలిపింది. తప్పుడు కథనాలు ప్రచారం చేసిన టీఆర్ఎస్ కు  చెందిన టీవీ, పేపర్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరించింది. 40 ఏళ్లుగా పారదర్శకంగా వ్యాపారం చేస్తూ విశ్వసనీయ కంపెనీగా కస్టమర్ల నమ్మకాన్ని సొంతం చేసుకున్నామని విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం తెలిపింది.