పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటిసులిచ్చారు. విశాఖ వదిలి వెళ్లి పోవాలంటూ 41 ఏ నోటీసులిచ్చారు. సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వదిలి వెళ్లాలని సూచించారు. జనసేన కార్యకర్తల అరెస్ట్ నేపథ్యంలో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ జనవాణి కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, సభలు, సమావేశాలు,ప్రదర్శనలు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు.

తనకు నోటీసులివ్వడంపై పవన్ మండిపడ్డారు.  నేర చరిత్ర కల్గినవారు అధికారంలో ఉంటే ఇలాగే ఉంటుందన్నారు. ప్రాంతాలు, కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్  బలంగా పనిచేస్తోందని..బలహీనులపైన బలప్రయోగం చేస్తున్నారన్నారు.  జనసేన నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు . ప్రజాసమస్యలు వినిపించడానికి వస్తే ఇన్ని ఆంక్షలా అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు బూతుల పంచాంగం వినిపించడం మాత్రమే తెలుసన్నారు . రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారిస్తే ఎట్లా అంటూ ఫైర్ అయ్యారు. జనవాణి ద్వారా సమస్యలు తెలియజేయడానికి వస్తే ఇన్ని ఆంక్షలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.

విశాఖలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు పవన్ కల్యాణ్. అయితే పవన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు వైసీపీ శ్రేణులు. దీంతో ఉధ్రిక్త పరిస్థితి ఏర్పడింది. జనసేన, వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.