కాంగ్రెస్​కు అసెట్.. వివేక్​ వెంకటస్వామి

కాంగ్రెస్​కు అసెట్.. వివేక్​ వెంకటస్వామి

కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ గడ్డం  వివేకానంద వెంకటస్వామి చేరడం ఆ పార్టీకి అసెట్​గా మారిందని పేర్కొనవచ్చు. మంచితనం, మానవత్వం ఉట్టిపడే మనిషిగా, రాజకీయ నేతగా వివేక్​కు మంచి పేరు ఉంది.తండ్రి ‘కాకా’ జి. వెంకటస్వామి అడుగు జాడల్లో నడుస్తున్న నేతగా, తెలంగాణ సాధన ఉద్యమంలో వివేక్ పెద్దపల్లి ఎంపీగా ఉండి కీలక పాత్ర పోషించారు. వివేక్ వెంకటస్వామితో పాటు అప్పటి కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధు యాష్కి గౌడ్, కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, జగన్నాథం సహా తమ ఎంపీ పదవులకు రాజీనామా లేఖలను కూడా అందజేశారు.

వివేక్ తండ్రి, తెలంగాణ కొంగుబంగారం మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత గడ్డం వెంకటస్వామి తెలంగాణ తొలి, మలి, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ అత్యుత్తమ సీడబ్ల్యూసీ సమావేశాన్ని  కూడా కాకా బహిష్కరించారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త  ప్రొఫెసర్​ జయశంకర్ సర్,  జేఏసీ చైర్మన్ కోదండరాం,  కాకాతో పలుమార్లు సమావేశం అయి చర్చించేవారు. ఆ సమావేశంలో వివేక్ కూడా పాల్గొనేవారు. వారికి కాకా దిశానిర్దేశం చేసేవారు. నేను కూడా ఆ సమావేశంలో పాల్గొనే వాడిని.

ప్రజల  మనిషి వివేక్​

వివేక్ తెలంగాణ ఉద్యమ సందర్భంగా అరెస్ట్ కూడా అయ్యారు. సింగరేణి జేఏసీ నిర్వహించిన పలు సమావేశాల్లో వివేక్ పాల్గొని ప్రోత్సహించేవారు. వివేక్ పక్కా పీపుల్ మనిషి. పలు సేవా కార్యక్రమాలను వివేకానంద  దాదాపు మూడు దశాబ్దాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూర్, రామగుండం, ధర్మపురి, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్నవారికి ఆపన్న హస్తంలా ఉంటారు. దాన, ధర్మాలు, సేవలు కాకా ద్వారా వివేక్​కు సంక్రమించాయని చెప్పవచ్చు. వివేక్ ఒక కమిటెడ్, డివోటెడ్ పొలిటీషియన్ అని పేర్కొనవచ్చు.

నిజాయితీగా ప్రజాసేవ చేయడమే అయన ఎజెండా. వివేక్ అన్న మాజీ మంత్రి గడ్డం వినోద్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బెల్లంపల్లి నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. చెన్నూర్ నుంచి వివేక్  లేదా అయనతో పాటు కాంగ్రెస్​లో చేరిన గడ్డం వంశీ పోటీ చేస్తారు అని ప్రచారం జరుగుతున్నది. పార్టీకి, ప్రజలకు సేవ చేయడం, పార్టీ ఆదేశాలను పాటించడం, సీఎం  కేసీఆర్ ను గద్దె దించడం తన ధ్యేయం అని పేర్కొంటున్న వివేక్, అయన తనయుడు వంశీ తమ ఆశయ సాధనలో సక్సెస్ కావాలని ఆశిద్దాం. రాజకీయాలకు అతీతంగా తమ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుందాం.అల్ ది బెస్ట్ వివేక్ జీ! 

ALSO READ : మంత్రి మల్లారెడ్డి.. ఓ బఫూన్: మైనంపల్లి 


ఇది తృతీయ తెలంగాణ ఉద్యమం

ఎన్నికల బరిలో వివేక్ ఈసారి అసెంబ్లీకి సంబంధించి ఉంటారా? లేదా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా దాదాపు ఏడున్నర దశాబ్దాల అనుబంధం ఉన్న వివేక్ కుటుంబం ఇప్పుడు స్వంత గూటికి చేరి ఉపశమనం పొందింది.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీకి కూడా  పార్టీ సేవ ద్వారా వివేక్  కొంత రుణం కూడా తీర్చుకున్నట్లు అవుతుంది. అయితే బీజేపీకి తెలంగాణలో వివేక్ నిష్క్రమణ భారీ నష్టమే.కేసీఆర్​ను గద్దె దించాలంటే మూడో తెలంగాణ ఉద్యమం అవసరం. ఆ మూడో తెలంగాణ ఉద్యమానికి  కాంగ్రెస్​ పార్టీయే సరైన వేదికగా వివేక్​ భావించి ఉంటారు. అది వంద శాతం నిజం కూడా! -

-----------

– ఎండి.మునీర్, సీనియర్ జర్నలిస్ట్