పంట నష్ట పరిహారం 20 వేలు ఇయ్యాలె : వివేక్ వెంకటస్వామి

పంట నష్ట పరిహారం 20 వేలు ఇయ్యాలె : వివేక్ వెంకటస్వామి

పంట నష్ట పరిహారం 20 వేలు ఇయ్యాలె
తడిసిన వడ్లన్నీ కొనాలె: వివేక్ వెంకటస్వామి
రిటైర్డ్ ఆఫీసర్లకు లక్షల జీతాలిచ్చి సలహాదారులుగా నియమిస్తరా? 
అవినీతి సర్కార్ ను గద్దె దించాలని ప్రజలకు పిలుపు 
బెల్లంపల్లిలో భారీ బైక్ ర్యాలీ

మంచిర్యాల/బెల్లంపల్లి,వెలుగు : సీఎం కేసీఆర్ అవినీ తి, నియంతృత్వ పాలనకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేశ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కాల్టెక్స్, ఫ్లైఓవర్, ఏఎంసీ, మార్కెట్ రోడ్, బస్టాండ్ రోడ్ మీదుగా తాండూర్ ఐబీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఐబీలో జెండా ఆవిష్కరించి పార్టీ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు ఆగమవుతుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన వడ్లను కొనుగోలు చేస్తామని  సిరిసిల్లలో ప్రకటించిన మంత్రి కేటీఆర్.. మొన్న బెల్లంపల్లికి వచ్చినప్పుడు ఆ మాట ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బెల్లంపల్లిపై అంత ప్రేమ ఉంటే ఇప్పటివరకు ఇక్కడ  ఎందుకు అభివృద్ధి చేయలేదని, ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. పట్టణంలో డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదని, మెడికల్ కాలేజీ తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. తడిసిన వడ్లను చివరి గింజ వరకూ కొనాలని, రైతులకు ఎకరానికి రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలని, కౌలు రైతులకు రైతు బీమా, పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.. 

తాండూర్ ఐబీలోని తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఐకేపీ వీఏవోలు సమ్మె చేస్తుండగా వివేక్ మద్దతు ప్రకటించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి రాగానే అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబీకులకే పదవులు కట్టబెట్టి నెలకు రూ.25 లక్షల జీతం తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రిటైర్డ్ ఆఫీసర్లకు నెలకు రెండు మూడు లక్షల జీతాలు ఇచ్చి సలహాదారులుగా పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వీఏవోల సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్టు ఎంప్లాయీస్ ను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, ప్రధాన కార్యదర్శులు మునిమంద రమేశ్, అందుగుల శ్రీనివాస్, రజినీష్ జైన్, నాయకులు కొయ్యల ఏమాజీ, కోడి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. 

పేదలపై భారం మోపిన కేసీఆర్... 

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, కరెంట్, ఆర్టీసీ చార్జీలతో పాటు నిత్యవసరాలు, లిక్కర్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిందని వివేక్ మండిపడ్డారు. రేషన్ షాపుల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐదు కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కోటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నీరుగార్చి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా పేదలకు మూడు కోట్ల ఇండ్లు కట్టించారని తెలిపారు. పేదల అభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దించి బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.