రామగుండం ఫ్యాక్టరీ రీఓపెన్​పై వివేక్ వెంకటస్వామి హర్షం

రామగుండం ఫ్యాక్టరీ రీఓపెన్​పై వివేక్ వెంకటస్వామి హర్షం

గోదావరిఖని, వెలుగు: ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆర్ఎఫ్​సీఎల్​జాతికి అంకితం కావడం తన జీవితంలో మరిచిపోలేని రోజు అని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్‌‌ చేయించేందుకు తన తండ్రి వెంకటస్వామితో కలిసి తాను పడ్డ శ్రమకు ఇన్నాళ్లకు ఫలితం దక్కిందన్నారు. శనివారం రామగుండం ఎన్టీపీసీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో కేంద్ర మంత్రి కిషన్‌‌ రెడ్డి మాట్లాడుతూ ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ పునరుద్దరణ కోసం వివేక్‌‌ చాలా కృషి చేశారని, ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని చాలాసార్లు తీసుకెళ్లారని గుర్తు చేశారు. 

దీంతో సభకు హాజరైన బీజేపీ నేతలు వివేక్‌‌ వద్దకు వచ్చి పైకెత్తుకొని అభినందనలు తెలిపారు. అనంతరం వివేక్​ మాట్లాడుతూ.. ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ప్లాంటు‌ను గ్యాస్‌‌ ఆధారంగా ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. దేశంలో రైతులు యూరియా కోసం పడుతున్న శ్రమను చూసిన ప్రధాని మోడీ.. యూరియా ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఈ ప్లాంటును నిర్మించారన్నారు. దీనితో రాష్ట్ర రైతులకు ఎరువుల కొరత తీరుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల రైతులకు కూడా యూరియా అందుతుందని, అందువల్ల విదేశాల నుంచి యూరియా దిగుమతి అవసరం తగ్గుతుందన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయబోమని ప్రధాని ప్రకటన చేయడంతో టీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని సైతం తిప్పికొట్టినట్లు అయిందన్నారు.  సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా 49 శాతం ఉన్న తాము ఎలా ప్రైవేటీకరిస్తామని కేసీఆర్ ను మోడీ ప్రశ్నించారని వివేక్ తెలిపారు.