ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌ రీఓపెన్ వెనక వివేక్ వెంకటస్వామి కృషి

ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌ రీఓపెన్ వెనక వివేక్ వెంకటస్వామి కృషి

హైదరాబాద్/గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ(ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌)ని రీఓపెన్ చేయడం వెనక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి ఎంతగానో కృషి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. ‘‘వివేక్ నన్ను కలిసిన ప్రతిసారీ ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ప్రస్తావన తెచ్చేవారు. ఈ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం గురించి ప్రధాని మోడీతో మాట్లాడాలని అడిగేవారు” అని ఆయన తెలిపారు. ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ రీఓపెన్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రత్యేకంగా కృషి చేశారని మెచ్చుకున్నారు. ప్రధాని రాక సందర్భంగా శనివారం బేగంపేట ఎయిర్​పోర్టులో బీజేపీ నిర్వహించిన స్వాగత సభలో, అనంతరం రామగుండంలో జరిగిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ చొరవతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు. గ్రామాల్లో స్ట్రీట్‌‌‌‌లైట్లు, పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా కేంద్రమే ఇస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే రూ.6,338 కోట్లతో ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ ను పునరుద్ధరించిందని తెలిపారు. రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ను కేంద్రం మంజూరు చేస్తే.. సీఎం కేసీఆర్ స్థలం ఇవ్వడంలేదన్నారు. ట్రైబల్ మ్యూజియం, సైన్స్ సిటీకి కూడా భూమి ఇవ్వలేదన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు సహకరించకుండా అడ్డుకుంటోంది కూడా కేసీఆరేనని విమర్శించారు. మోడీ హయాంలో దేశం లోని నేషనల్ హైవేలు డబుల్ అయ్యాయన్నారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రామగుండంలో దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటును మోడీ ఇదివరకే ప్రారంభించారని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం.. ఎన్టీపీసీలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా కోల్ ఇండియా మైన్లను ప్రైవేట్ పరం చెయ్యలేదని, సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామన్నది కూడా తప్పుడు ప్రచారమన్నారు.     

వెయ్యి మంది కేసీఆర్​లు వచ్చినా.. మోడీని అడ్డుకోలేరు 

కేసీఆర్ లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా.. మోడీని అడ్డుకోలేరని కిషన్ రెడ్డి అన్నారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టి, కిరాయి మనుషులతో బ్యానర్‌‌లు కట్టించి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం ప్రధాని వస్తే మర్యాద ఇవ్వకపోవడం దారుణమన్నారు. మోడీ మళ్లీ మళ్లీ తెలంగాణకు వస్తారన్నారు. ప్రధాని వస్తే సీఎం కనీసం స్వాగతం పలకలేదని, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇలాంటి వైఖరి లేదన్నారు. రాష్ట్రం లో ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను, యువజన సంఘాలను అవమానిస్తున్నారని, తెలంగాణకు ద్రోహం చేసేలా నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. మహిళ అని చూడ కుండా గవర్నర్‌‌ను సైతం అవమానిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్​కు అభివృద్ధి కంటే ఆయన కుటుంబమే ముఖ్యమన్నారు.