చెన్నూరులో రౌడీ పాలన.. బీఆర్ఎస్ గ్యాంగ్​స్టర్లను తయారు చేస్తున్నది

చెన్నూరులో రౌడీ పాలన.. బీఆర్ఎస్ గ్యాంగ్​స్టర్లను  	తయారు చేస్తున్నది
  • ఇంటింటికీ నీళ్లిస్తే గ్రామాల్లో సమస్య ఎందుకున్నదని ప్రశ్న
  • వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసిన బోర్ వెల్స్ ప్రారంభం

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టంలో గ్యాంగ్​స్టర్లను తయారు చేస్తున్నదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి మండిపడ్డారు. ‘‘ప్రజలు, ప్రతిపక్ష నాయకులు సమస్యలపై ప్రశ్నిస్తే.. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తుపాకీతో కాల్చేస్తామని బెదిరిస్తున్నారు. తుపాకీతో కాల్చడానికేనా తెలంగాణ సాధించుకున్నది? చెన్నూర్​లో రౌడీ పాలన సాగుతోంది” అని ఫైర్ అయ్యారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్​నియోజకవర్గంలో వివేక్ పర్యటించారు. గతంలో గంగారం, నాగపూర్​గ్రామస్తులు నీటి సమస్యపై వివేక్ కు విన్నవించగా.. ఆయన స్పందించి వెంకటస్వామి ఫౌండేషన్​ద్వారా రెండు ఊర్లలో బోర్లు వేయించారు. వివేక్ మంగళవారం వాటిని ప్రారంభించి మాట్లాడారు. రాష్ర్టంలో ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వడంలో సీఎం కేసీఆర్​ 
ఫెయిలయ్యారని ఆయన విమర్శించారు. మిషన్​భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లిస్తే, గ్రామాల్లో ఇంకా నీటి సమస్య ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు. గ్రామాల్లో ఏ ఆడబిడ్డ నీళ్ల బిందె పట్టుకొని బయటకు వెళ్లకూడదని చెప్పిన కేసీఆర్.. వాళ్లను మోసం చేశారని మండిపడ్డారు. 


సుమన్ బెదిరింపులకు భయపడం.. 

ఎన్నికల టైమ్​లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని వివేక్ మండిపడ్డారు. లిక్కర్ రేట్లు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టారని, తద్వారా వచ్చే పైసలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. బాల్క సుమన్ ల్యాండ్, సాండ్ మాఫియాతో వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ‘‘ఇటీవల చెన్నూర్​లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ‘గన్నుతో కాలుస్తాం.. ట్రిగ్గర్​నొక్కితే తెలుస్తుంది’ అని ప్రజలను, ప్రతిపక్ష నేతలను భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ సుమన్ బెదిరింపులకు ఎవరూ భయపడరు. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు రోజులు దగ్గరపడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని అన్నారు. అంతకుముందు సోమన్​పల్లిలో బీజేపీ జెండాను వివేక్ ఆవిష్కరించారు. పొన్నారంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్​కు ప్రతిచోట డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్, రజినీశ్​జైన్, పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్​ కో కన్వీనర్​ నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.