
కోల్‌బెల్ట్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచంలోనే గొప్ప లీడర్‌గా గుర్తింపు పొందారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు ప్రధాని కృషి చేస్తున్నారన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో బీజేపీ చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ అందుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు పార్టీలో చేరారు. వారికి వివేక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వివేక్ మాట్లాడుతూ.. దేశ యువతలో ప్రధాని మోదీపై విశ్వాసం ఉందన్నారు. ‘‘ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు జీ-20 సదస్సు ఉపయోగపడింది. వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల ‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. మోదీ ప్రధాని అయ్యాక ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదిగింది.
ALSO READ:గ్లోబల్ లీడర్ల జాబితాలో టాప్.. ప్రపంచంలో నంబర్ వన్ మోదీ
ఇప్పుడు మూడో స్థానానికి చేర్చేందుకు కృషి చేస్తున్నారు. దీనివల్ల యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. కరోనా సమయంలో ప్రధాని ప్రజలను ఆదుకున్నారు. 80 లక్షల మందికి పది కిలోల చొప్పున బియ్యం అందించారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి మోదీ నాయకత్వాన్ని బలపరచాలి” అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షు డు రఘునాథ్ వెరబెల్లి, మాజీ ఎమ్మెల్యే సొత్కు సంజీవరావు, లీడర్లు ముల్కల మాల్లారెడ్డి, ఆకుల అశోక్ వర్ధన్, సప్పిడి నరేశ్, పట్టి కృష్ణ పాల్గొన్నారు.