
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెల్లువెత్తుతున్నాయని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు కాని.. ప్రగతి భవన్ కట్టుకున్నారని ఫైర్ అయ్యారు. పెట్రోలు, డీజిల్ పై మిగతా రాష్ట్రాల్లో కంటే.. తెలంగాణలో ఎక్కువ వసూలు చేస్తున్నాడని సీఎం కేసీఆర్ పై ఆయన ధ్వజమెత్తారు. హామీలను నెరవేర్చని కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని బీజేపీ కార్యకర్తలకు, ప్రజలకు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. డబ్బులకు ఓటును తాకట్టు పెట్టొద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక బీజేపీ బలోపేతం అయిందని వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ పార్టీకి బండి సంజయ్ గట్టి పునాది వేశారని ఆయన కొనియాడారు. బండి పాదయాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని ఆయన పై ప్రశంసలు కురిపించారు.