రాష్ట్రంలో రాక్షస పరిపాలన: వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో రాక్షస పరిపాలన: వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల / వెల్గటూరు, వెలుగు:  రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగుతోందని, సీఎం కేసీఆర్ తెలంగాణను అవినీతి, అప్పుల, తాగుబోతుల రాష్ర్టంగా మార్చాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ లీడర్లు దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని అంబేద్కర్ చౌక్, నస్పూర్ మండలం శ్రీరాంపూర్ బస్టాండ్, మందమర్రి మండలం పులిమడుగులో నిర్వహించిన బీజేపీ స్ర్టీట్ కార్నర్ మీటింగ్ లకు చీఫ్ గెస్ట్ గా వివేక్ హాజరయ్యారు. తర్వాత జగిత్యాల జిల్లా వెల్గటూర్, తిమ్మాపూర్ లలో జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. మీటింగ్స్ లో ఆయన మాట్లాడుతూ.. చెన్నూర్ లో బీజేపీ కార్నర్ మీటింగ్ పెడితే జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ లీడర్లు దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ రౌడీయిజం, గూండాగిరీ చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 1.25 లక్షల కోట్లు కేటాయించి, అందులో రూ. వేల కోట్ల కమీషన్లను కేసీఆర్ దండుకున్నాడని ఆరోపించారు. తప్పుడు రీడిజైనింగ్ వల్ల బ్యాక్ వాటర్​తో మంచిర్యాల, చెన్నూర్, మంథని పట్టణాలు, పదుల సంఖ్యలో పల్లెలు, వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయని అన్నారు. మిషన్ భగీరథకూ రూ. 40 వేల కోట్లు పెట్టి.. అందులోనూ వేల కోట్లు దోచుకున్నాడని అన్నారు.  తెలంగాణ ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రాష్ట్రం మరో శ్రీలంకగా మారుతోందని వివేక్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ దోపిడీని ప్రజలకు వివరించేందుకే ప్రజాగోస– బీజేపీ భరోసా కార్యక్రమం చేపట్టామన్నారు.  

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిండు

రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్ తన సొంత ఆస్తులు పెంచుకున్నాడని వివేక్ మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబానికి 25 వేల ఎకరాల భూములు ఉన్నాయన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ తన కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నాడని, రాష్ట్ర ఖజానా నుంచి నెలకు రూ.25 లక్షల జీతాలు తీసుకుంటున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఇంటింటికి నల్లా కనెక్షన్లు, 24 గంటల కరెంటు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కరెంట్, ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్య ప్రజలను దోచుకుంటున్నాడని, పెట్రోల్, డీజిల్ రేట్లు మిగతా రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే రూ.10 ఎక్కువగా ఉన్నాయన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేకు భూదందాలు తప్ప అభివృద్ధి చేయడం చేతకాదన్నారు.  సింగరేణి ప్రాంతంతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, నష్టాల్లోకి జారిపోయినప్పుడు తన తండ్రి వెంకటస్వామి కృషితోనే సంస్థ గాడిలో పడ్డదని వివేక్ తెలిపారు. సీఎం కేసీఆర్ 2018 ఫిబ్రవరిలో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, కానీ వాటిని నెరవేర్చకుండా మోసం చేశాడన్నారు.


బీజేపీ వస్తే పేదలందరికీ ఇండ్లు 

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో సాగుతోందని వివేక్ చెప్పారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసిందని, ఫ్రీగా వ్యాక్సిన్లు అందజేసిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే పీఎం ఆవాస్ యోజన కింద పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ స్కీం కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, ప్రధాన కార్యదర్శులు మునిమంద రమేశ్, అందుగుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బొమ్మెన హరీశ్ గౌడ్, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ జాయింట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్లుగౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్, చెన్నూర్ నియోజకవర్గం పార్టీ కన్వీనర్ అక్కల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.