సాఫ్ట్ వేర్ జాబ్ ఇష్టం లేక ఎంప్లాయ్ ఆత్మహత్య

సాఫ్ట్ వేర్ జాబ్ ఇష్టం లేక ఎంప్లాయ్ ఆత్మహత్య

కేపీహెచ్ బీ పీఎస్ పరిధిలో ఘటన

సాఫ్ట్ వేర్ జాబ్ చేయడం ఇష్టం లేక ఎంప్లాయ్  ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్ బీ పీఎస్ పరిధిలో జరిగింది, పోలీసుల కథనం ప్రకారం..వైజాగ్ లోని దువ్వాడ ప్రాంతం కుర్మనపాలెంనకు చెందిన గుండ్ల వెంకట మురళి కృష్ణారావు కుమారుడు వెంకట నాగచైతన్య(23) బీటెక్ పూర్తిచేశాడు. ఆ తర్వాత నాగచైతన్య సిటీకి వచ్చి ఓ కోచింగ్ సెంటర్ లో సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్చుకున్నాడు. 2 నెలల క్రితం జూబ్లీహిల్స్ లోని టీఏ డిజిటల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ రావడంతో నాగచైతన్య కేపీహెచ్ బీకాలనీ మూడో రోడ్డులోని బాలాజీ మెన్స్ హాస్టల్ లో ఉంటూ ఆఫీసుకి వెళ్తున్నాడు.

శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నాగచైతన్య రూం దగ్గరికి హాస్టల్ ఓనర్ సీతారెడ్డి వచ్చాడు. ఎంతసేపు డోర్ కొట్టినా నాగచైతన్య తీయకపోవడంతో అనుమానంతో సీతారెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రూం డోర్​ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. నాగచైతన్య సీలింగ్ ఫ్యాన్​కు బెడ్​షీట్​తో ఉరేసుకొని కనిపించాడు.  సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. తనకు సాఫ్ట్ వేర్ జాబ్ చేయడం ఇష్టం లేదని..ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నాగచైతన్య సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. మృతుడి తండ్రి కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సక్రం తెలిపారు.