ప్రజాహక్కుల గొంతుక ప్రొఫెసర్ బుర్ర రాములు

ప్రజాహక్కుల గొంతుక ప్రొఫెసర్ బుర్ర రాములు

రా ష్ట్రంలో ఎక్కడ హక్కుల హననం జరిగినా నేనున్నానంటూ బాధితుల తరఫున గొంతెత్తిన హక్కుల నేత ప్రొఫెసర్​ బుర్ర రాములు సార్ భౌతికంగా దూరమై నేటికి 14 ఏళ్ళు.  రాజకీయ పార్టీలు, సంస్థలు వివిధ సంక్షుభిత సందర్భాల్లో విఫలమైనప్పుడు వారి గొంతుపెకలని సందర్భంలోనూ గొంతువిప్పిన ధీశాలి. దిక్కుమొక్కులేని జనానికి పెద్ద దిక్కుగా నిలిచి, అనేక రాజకీయ, సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచిన రాములు సార్​ లేని లోటు రాష్ట్రంలో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోంది. 

80 వ దశకంలో విద్యార్థి, ప్రజా ఉద్యమాల నుంచి ఎదిగి వచ్చి, హక్కుల బాటసారిగా రాష్ట్ర నలుమూలలనేగాక దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యపరిచిన ఆయన జీవితం, ఆయన పాటించిన విలువలు ఈ తరం హక్కుల కార్యకర్తలకు, బుద్ధిజీవులకు అనుసరణీయం. ఎన్నో కలలుగని తెచ్చుకున్న తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న  అనేక సవాళ్లు, సంక్షోభాల సందర్భంలో బుర్రా రాములు జీవితం, హక్కుల ఉద్యమ నేపథ్యం, సామాజిక విలువల కొనసాగింపును  ఆయన సంస్మరణ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితం. హక్కుల ఉద్యమ సేనానిగా పోరాడిన రాములు సార్ చిరస్మరణీయుడు. 

- డా. సాదు రాజేష్​-