- సిటీలో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు
- అభ్యర్థులు, పార్టీల మేనిఫెస్టోలపైనా తెలియజేస్తూ..
- ఎన్నికల రూల్స్ అతిక్రమించకుండా ప్రచారంపైనా నిఘా
- డబ్బు, మద్యానికి చెక్ పెట్టాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు, పార్టీలకు మధ్య వారధిగా పని చేస్తాయి. ముఖ్యంగా ఓటర్లకు ఎన్నికలపై అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఓటు నమోదు నుంచి ఓటు వేసే వరకు ప్రజలను అవేర్ నెస్ చేస్తూ సదస్సులు నిర్వహిస్తాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రలోభాలు, మేనిఫెస్టోల అమలు, అభ్యర్థుల నేరచరిత్రకు సంబంధించిన విషయాలను జనాలకు తెలియజేస్తున్నాయి. పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల రూల్స్ అతిక్రమించడంపై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తూ, ప్రచారంపైనా నిఘా పెట్టాయి.
యూత్ టార్గెట్‌గా..
ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో 8 లక్షలకు పైగా యువత, సిటీలో 59, 082 మంది యూత్ కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యువ ఓటర్ల సంఖ్య పెరగడానికి ఎన్నికల సంఘంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఓటు ఎలా నమోదు చేసుకోవాలి, ఎలా వేయాలి, ఎలాంటి అభ్యర్థులకు వేయాలి వంటి అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఓటును నోటుకు, మద్యానికి తాకట్టుపెట్టొంద్దంటూ ప్రచారాలు చేస్తున్నాయి. సిటీలోని పలు సంస్థలకు చెందిన విద్యార్థులు కాలేజీల్లో యువతకు ఓట్ ఫర్ బెటర్ప్యూచర్పేరుతో ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఓటును కులం, మతం, డబ్బు, మద్యం కోసం కాకుండా భావితరాల కోసం ఆలోచించి వేయాలని కాలేజీ విద్యార్థులకు తెలియజేస్తున్నాయి. సోషల్మీడియాలో రకరకాల ఫొటోలు, వీడియోలతో ఓటు ఆవశ్యకతపై వివరిస్తున్నాయి.
సరైన నాయకుడిని ఎన్నుకోవాలని..
పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన సభ్యులు నగరంలోని ప్రధాన సర్కిళ్లలో డబ్బుకు, మద్యానికి ఓటును అమ్ముకోవద్దని ప్లకార్డుల ప్రదర్శన చేస్తున్నారు. మరికొందరు పాంప్లేట్లను ప్రజలకు పంచుతున్నారు. భూకబ్జాకోరులు, అక్రమార్కులు, అవినీతిపరులకు ఓటెయ్యెద్దని ప్రచారం చేస్తున్నారు. ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఆయుధం ఓటు, దానిని సక్రమంగా వినియోగించుకుని, సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఓటర్లకు చెబుతున్నారు. సిటీలో ఐటీ ఉద్యోగులు, యూత్, కొన్ని వర్గాల ప్రజలు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనరు. ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. ఆయా వర్గాలు ఓటు వేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు.
నేరచరితులకు టికెట్లు ఇవ్వొద్దు
రాజకీయ పార్టీలు నేరచరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇవ్వొద్దు. ఒకవేళ ఇచ్చినా సరైన కారణాలను వెల్లడించాలి. రాజకీయ నేతలు ఏటా తమ ఆస్తులను ప్రకటించాలి. ఓటర్లు పార్టీలను, మేనిఫెస్టోలను చూసి కాకుండా అభ్యర్థిని చూసి ఓటు వేయాలి. ఎన్నుకునే అభ్యర్థి స్థానికుడై ఉండాలి. అప్పుడే అతడికి స్థానిక సమస్యలు తెలుస్తాయి. ఇలాంటి వాటిపై మా సంస్థ ప్రజలను ఎప్పటికప్పుడు అవేర్ నెస్ చేస్తుంది. సిటీతో పాటు ఇతర సంస్థలతో కలిసి వివిధ జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ప్రజల్లో మార్పు రావాలి
దేశంలో ఎన్నికలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. ప్రజలు అమ్ముడుపోతున్నంత కాలం నాయకులు కొంటూనే ఉంటారు. ముందు ప్రజల్లో మార్పు రావాలి. అప్పుడే నేతలు మారతారు. దీని కోసం మా వంతుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. పాలిట్రిక్స్ బుక్స్ పంచుతూ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాజకీయ నేతలు ఎలా మారుతున్నారో తెలియజేస్తున్నాం.
-సూరన్న, కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ సొసైటీ