ఆధిపత్య పార్టీలకు ఓట్లేయొద్దు : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

ఆధిపత్య పార్టీలకు ఓట్లేయొద్దు :  ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

ఆధిపత్య పార్టీలకు ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని మార్చి, బహుజనుల అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే అవకాశముందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో 43వ రోజు బహుజన రాజ్యాధికార యాత్రను ఆయన కొనసాగించారు. వల్లభి, సూరంపల్లి, మల్లారం, కమలాపురం, పమ్మిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇంతకాలం ఆధిపత్య పార్టీల హామీలను నమ్మి ఓట్లు వేస్తే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, సంపదను పేద వర్గాలకు దూరం చేసి, బహుజనులను బానిసలుగా మార్చారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మల్లారంలో బీఎస్పీ జెండా దిమ్మె కూల్చిన సంఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలు, గనుల లీజు, సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్లు ఆధిపత్య కులాలకు చెందినవారేనని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు అవకాశాలు దక్కడం లేదన్నారు. అప్పల నరసింహపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తై శిథిలావస్థకు చేరుకున్నా లబ్ధిదారులను ఎంపిక చేయడంలో రాష్ట్ర  ప్రభుత్వం పూర్తిగా వైఫలమైందని ఆరోపించారు.

దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంతో మరో మోసానికి తెర తీశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులు, బంధువులకు లక్షల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టడానికి దళిత బంధు ప్రవేశపెట్టారని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే బీఎస్పీ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో  బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మన ఓట్లు మనమే వేసుకుని రాష్ట్రాన్ని ఏలుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

ఏ వర్గానికి బీజేపీ మేలు చేయలేదు

నేనడిగే 21 ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి