మహారాష్ట్రలో బీజేపీ ఎదురీత!

మహారాష్ట్రలో బీజేపీ ఎదురీత!

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సమస్యాత్మక రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా నిలిచింది.  2019లో మహారాష్ట్రలోని 48 మంది ఎంపీ స్థానాల్లో 41 బీజేపీ కూటమికి దక్కాయి. అయితే, ప్రస్తుతం రాజకీయ అవాంతరాలు, పాత అధికార సమీకరణాలు ఈసారి  లేకపోవడంతో  మహారాష్ట్రలో బీజేపీకి ఆ స్థాయి విజయం కష్టంగా కనిపిస్తోంది.1995లో  శివసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. 1998లో శరద్ పవార్ కాంగ్రెస్‌‌‌‌ను వీడి ఎన్సీపీని స్థాపించారు. 1999లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో శరద్ పవార్  కాంగ్రెస్‌‌‌‌తో కలిశారు. 1999 ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

2014లో బీజేపీ, -శివసేన కూటమి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  1989 నుంచి ఈ రెండు పొత్తులు స్థిరంగా కొనసాగడంతో మహారాష్ట్ర  రాజకీయాల్లో ఒక రకమైన గందరగోళం ఏర్పడింది.  ఉద్ధవ్ థాకరే  నేతృత్వంలోని శివసేన  ప్రభుత్వం జూన్ 2022లో పడిపోయింది.  ఏక్​నాథ్​ షిండే  నేతృత్వంలో శివసేన నుంచి విడిపోయిన ఎమ్మెల్యేల గ్రూప్​ బీజేపీతో  కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది రెండవ పెద్ద అలజడి. ఆ తర్వాత జులై 2, 2023న శరద్ పవార్  సోదరుడి కొడుకు  అజిత్ పవార్ ఎన్సీపీని  చీల్చి, ఏక్​నాథ్ షిండే  ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర  రాజకీయాల్లో ఇది మూడో  అతిపెద్ద అలజడి.  కాగా, 1989 నుంచి 2019 మధ్య కేవలం రెండు బలమైన రాజకీయ కూటములు మాత్రమే ఉన్నాయి.  మహారాష్ట్రలో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఆధిపత్యం చెలాయించారు.  శివసేనకు చెందిన బాల్ థాకరే, ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్.  అయితే, బాల్ థాకరే మరణించడంతో  ఇప్పుడు శరద్ పవార్, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన ముఖ్యమంత్రి  ఏక్​నాథ్​ షిండేతోపాటు అనేకమంది కాంగ్రెస్ నాయకులు క్రీయాశీలకంగా ఉన్నారు.

 రాజకీయ అలజడి

‘అంతరాయం’ అంటే పాత నిబంధనలను ఉల్లంఘించడం అయినప్పటికీ, వాస్తవానికి ఇది సాంకేతికతలో చాలా సానుకూల అభివృద్ధిని సూచిస్తుంది.  టెక్నాలజీలో అతిపెద్ద అలజడి సృష్టించిన వ్యక్తి  స్టీవ్ జాబ్స్, అతను  ‘ఆపిల్ ఫోన్​’ సృష్టించాడు.  ఆపిల్​ఫోన్  ఇతర ఫోన్‌‌‌‌ల కంటే పూర్తిగా భిన్నంగా ఉంది.  స్టీవ్ జాబ్స్ ఆపిల్ ఫోన్‌‌‌‌ను  ప్రవేశపెట్టినప్పుడు,  చాలామంది  నిపుణులు దానిని ఎవరు కొనుగోలు చేస్తారని ఆశ్చర్యపోయారు. కానీ, ఇప్పుడు ఆపిల్​ ఫోన్ ప్రపంచంలోనే  అతిపెద్ద వాణిజ్య విజయంగా నమోదైంది. 'అంతరాయం' అనేది పెద్ద మార్పును, పెద్ద లాభాన్ని చూపించింది.  అదేవిధంగా మహారాష్ట్రలో 2019 నుంచి 2024 మధ్య  రాజకీయాలలో అంతరాయాన్ని మనం చూస్తున్నాం. ఈ "రాజకీయ అంతరాయం" కంటే ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో క్రమశిక్షణ, ఖచ్చితత్వం ఉండేది. బీజేపీ 1989 నుంచి శివసేనతో పొత్తును ప్రారంభించింది. బీజేపీ, శివసేనలకు తమ బలాలు, బలహీనతలు తెలుసు.  ఆ రెండు పార్టీల కూటమి నేతలు ఒకరికొకరు సహాయపడ్డారు. 2019లో ఈ కూటమి విడిపోయింది.  

ఉద్ధవ్​ వ్యవహార శైలి

శివసేన ఎప్పుడూ క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించలేదు. ఎమ్మెల్యేలు , ఎంపీలు అధినేత ముందు తలవంచాల్సిందే. 2019 నవంబర్‌‌‌‌లో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేలను తన సేవకులుగా భావించారు. శివసేన ఎమ్మెల్యేల అతిపెద్ద ఫిర్యాదు ఏమిటంటే ముఖ్యమంత్రి థాకరే తమను ఎప్పుడూ కలిసేవారు కాదు. పర్యవసానం 56 మంది శివసేన ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు ఆయనను విడిచిపెట్టారు. ఇది ఊహించని పెద్ద అలజడిగా పేర్కొనవచ్చు. మరోవైపు శరద్ పవార్ 1998లో స్థాపించిన ఎన్సీపీకి అధినేతగా ఉండేవారు.  శరద్ పవార్ తన జీవితాంతం ఎన్సీపీ  తన సొంత ఆస్తిలా ఉంటుందని భావించారు. 2023 జులైలో అకస్మాత్తుగా ఆయన కుడిచేతిలాంటి సోదరుడి కొడుకు అజిత్ పవార్ ఎన్సీపీని  చీల్చారు. తనతోపాటు చాలా మంది ఎమ్మెల్యేలను వెంట తీసుకువెళ్లారు. ఇది శరద్ పవార్ పార్టీలో పెను కలకలం రేపింది. 

మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి

మహారాష్ట్రలో అనేక అపోహలు బద్దలయ్యాయి. శివసేన-– బీజేపీ కూటమి విడదీయలేనిదనే భావన తప్పని రుజువైంది. ఉద్ధవ్ థాకరేకి భావజాలం కంటే అధికారం ఆకర్షణీయంగా ఉన్నందున బీజేపీ, శివసేన బంధం శాశ్వతమనేది తప్పు అని నిరూపితమైంది.  ఉద్ధవ్ థాకరే సేవకులుగా భావించిన శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. శివసేనతో  కాంగ్రెస్ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదనే అపోహ కూడా ఉండేది. అయితే, కాంగ్రెస్ ఇప్పుడు శివసేనకు బలమైన కూటమి భాగస్వామి. శరద్ పవార్ తన పార్టీని ఉక్కు హస్తంతో నడిపిస్తున్నారు ఆయనకు ఎదురు లేదని అంతా భావించారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట వెళ్లడంతో ఆ అపోహ కూడా బద్దలైంది. శరద్ పవార్‌‌‌‌కు అత్యంత సన్నిహితులైన  ప్రఫుల్ పటేల్, చగన్ భుజ్‌‌‌‌బల్ వంటి వారు కూడా శరద్ పవార్‌‌‌‌ని వదిలేశారు. స్టీవ్ జాబ్స్ ఆపిల్ ఫోన్‌‌‌‌ను డిజైన్ చేసినప్పుడు, ఎవరైనా కెమెరా ఉన్న ఫోన్‌‌‌‌ను ఎందుకు కొంటారని చాలామంది ఆశ్చర్యపోయారు.  కానీ,  ఆపిల్ ఫోన్.. కోడాక్, కానన్, తదితర గొప్ప కెమెరా కంపెనీలను మూసివేయించగలిగింది. 

సృష్టించుకున్న అలజడి

అదేవిధంగా శివసేన, శరద్ పవార్ పార్టీలు చీలిపోవడం బీజేపీకి అద్భుతమైన విజయం. కానీ, ఇది మహారాష్ట్ర రాజకీయాలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. ఉద్ధవ్  థాకరే  లేదా శరద్ పవార్‌‌‌‌కు ఎంత ప్రజామోదం ఉందనేదానిపై స్పష్టత లేదు. ఉద్ధవ్ థాకరే  ప్రభుత్వం ఒకవేళ  కొనసాగి ఉంటే మాత్రం మహారాష్ట్రలో బీజేపీకి 10 మందికి  మించి ఎంపీలు వచ్చేవారు కాదు. ముఖ్యమంత్రి ఏక్‌‌‌‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఎంత బలంగా ఉన్నారో బీజేపీ అంచనా వేయలేకపోతున్నది. అలాగే, మహారాష్ట్రలో ఇప్పుడు చాలామంది బలమైన కీలక నేతలు ఉన్నారు. వారి బలం ఇంకా నిరూపణ అవలేదు. అందుకే మహారాష్ట్రలో  బీజేపీ ఎంతమేరకు విజయం సాధిస్తామో అంచనా వేయలేకపోతోంది. మహారాష్ట్రలో బీజేపీ  స్వయంగా సృష్టించిన రాజకీయ అలజడి ఎదురుతిరగడంతో కమలం పార్టీ  సవాళ్లను ఎదుర్కుంటోంది.

- పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​​ ఎనలిస్ట్