వీఆర్వోల డ్యూటీ చేస్తున్న వీఆర్ఏలు

వీఆర్వోల డ్యూటీ చేస్తున్న వీఆర్ఏలు
  •     ఉత్తర్వులు ఇస్తున్న తహసీల్దార్లు
  •     ఇలాగైతే కొత్త సమస్యలు ఖాయమంటున్న రైతులు
  •     నెరవేరని ధరణి లక్ష్యం

రాష్ట్రంలో భూసమస్యలకు వీఆర్వోలే కారణమని ఆరోపిస్తూ వాళ్లందరినీ సర్కారు పక్కనపెడితే, ఆ పనులను తహసీల్దార్లు ఇప్పుడు వీఆర్ఏలతో చేయిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వీఆర్వోలపై అవినీతి ఆరోపణలతో పాటు భూరికార్డుల ప్రక్షాళన తర్వాత రికార్డులన్నీ డిజిటలైజ్ చేసినందున వాళ్ల అవసరం లేదని చెప్పిన సర్కారు, గతేడాది సెప్టెంబర్​7న స్టేట్​వైడ్​సుమారు 7వేల మంది వీఆర్వోలను రెవెన్యూ డిపార్ట్​మెంట్​ నుంచి తప్పించింది. వాళ్లను ఇప్పటికీ ఏ డిపార్ట్​మెంట్​కు కేటాయించకుండా వెయిటింగ్​లో ఉంచింది. కానీ ధరణి వచ్చినా ఫీల్డ్​లెవల్​లో ల్యాండ్​ ఇష్యూస్​అలాగే ఉండడంతో ఎప్పట్లాగే తహసీల్దార్లు వీఆర్వోలకు బదులు వీఆర్ఏ(విలేజ్​ రెవెన్యూ అసిస్టెంట్ల)లపై  డిపెండ్​ అవుతున్నారు. ధరణిలో ఇన్నాళ్లూ కరెక్షన్​ఆప్షన్స్​లేక చాలా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఇటీవలే గ్రీవెన్స్​అప్లికేషన్లు స్వీకరిస్తున్న కలెక్టర్లు, వాటిని తహసీల్దార్లకు పంపుతున్నారు. ప్రతి అప్లికేషన్​ను ఫీల్డ్​లెవల్​కు వెళ్లి పరిశీలించే టైం, ఓపిక లేని తహసీల్దార్లు వాటిని వీఆర్ఏలకు అప్పగిస్తున్నారు.  కలెక్టర్​ స్థాయిలో చేయాల్సిన సవరణలను వీఆర్ఏలు చేస్తుండడం, వారి చదువు, అనుభవం అంతంతే కావడంతో కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వీఆర్ఏలతో వెరిఫికేషన్​ 

భూసమస్యలకు శాశ్వత పరిష్కారంగా తెచ్చిన ధరణి సైట్​అనేక కొత్త సమస్యలకు కారణమవుతోంది. చిన్నచిన్న ప్రాబ్లమ్స్​తో పాసు బుక్కులు రాక వేలాది రైతులు ఇబ్బంది పడుతున్నారు. వందలాది సర్వే నంబర్లు ధరణిలో కనిపించడం లేదు. భూసేకరణ చేసిన చోట్ల మొత్తం సర్వేనంబర్లను ప్రొహిబిటెడ్​లిస్ట్​లో పెట్టారు. వీటితో పాటు పెండింగ్​మ్యుటేషన్​ సమస్యలు ఉన్నాయి. దీంతో  ధరణి పోర్టల్​లో గ్రీవెన్స్​కు ప్రభుత్వం చాన్స్​ఇచ్చింది. బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలను జత చేస్తూ అప్లై చేస్తే వాటిని ఆఫీసర్లు పరిశీలించి  పరిష్కరించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను ఇటీవల స్పీడప్​చేశారు. గ్రీవెన్స్​అప్లికేషన్లు తొలుత కలెక్టర్​లాగిన్​లోకి వెళ్తుండగా వాటి వెరిఫికేషన్ బాధ్యతలను ఆయా కలెక్టర్లు సంబంధిత తహసీల్దార్లకు అప్పగిస్తున్నారు. వీటిని తహసీల్దార్లు రెవెన్యూ ఇన్​స్పెక్టర్లతో వెరిఫికేషన్​చేయించాల్సి ఉంది. కానీ అంతంతే చదువు, అనుభవం ఉన్న వీఆర్ఏలకు  అప్పగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మౌఖికంగా ఆదేశాలిస్తే కొన్నిచోట్ల ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్​ బాధ్యతలు చూస్తున్న తహసీల్దార్లు, ఆ తర్వాత వీఆర్ఏలతో ధరణి పెండింగ్​ఫైళ్లపై కసరత్తు చేయిస్తున్నారు. చెక్​ లిస్ట్​ తయారు చేయించి ఫైల్స్​రెడీ చేయిస్తున్నారు. 

ఫీల్డ్​ ఎంక్వైరీ ఎక్కడ?

గ్రీవెన్స్​అప్లికేషన్లపై ఫీల్డ్​లెవల్​ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి పనులన్నీ వీఆర్వోలకు అప్పగించేవారు. రాష్ర్టంలో ఒక్కో మండలంలో సుమారు 10 నుంచి 20  వరకు రెవెన్యూ విలేజీలు ఉన్నాయి. కానీ మండలానికి ఒక్క ఆర్ఐ మాత్రమే ఉన్నాడు. కొన్నిచోట్ల మాత్రమే ఇద్దరు చొప్పున ఉన్నారు. కొన్నిచోట్ల ఆర్ఐలను కూడా  ఇన్​చార్జిలతో నెట్టుకొస్తున్నారని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏడు నెలల కింద వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారు. దీంతో పని భారం మొత్తం ఆర్​ఐల పై పడుతోంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, భూ రికార్డుల పరిశీలన లాంటివి తలకు మించిన భారంగా మారాయి. ఇంత ఒత్తిడి మధ్య తమ పనులను అర్హత, అనుభవం లేని వీఆర్ఏలపై నెట్టేస్తున్నారు. సాధ్యమైనన్ని పనులు వారితోనే పూర్తి చేస్తున్నారు. ఫీల్డ్​ఎంక్వైరీ నామ మాత్రంగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే రాష్ర్టవ్యాప్తంగా సుమారు 20 వేలకు పైగా ఉన్న వీఆర్​ఏలకు సీఎం కేసీఆర్​ గతంలో రెండుసార్లు వరాలు కురిపించారు. పే స్కేలు వర్తింపు, ప్రమోషన్లు, అర్హులకు ఇతర శాఖల్లో అడ్జస్ట్​మెంట్ వంటి హామీలు నేటికీ నెరవేరడం లేదు. ఏ అవసరమొచ్చినా వీళ్లనే వాడుకుంటున్నా వారి సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.