ఆర్టీసీలో వీఆర్ఎస్: 50 శాతం స్టాప్ తగ్గించే యోచనలో ప్రభుత్వం

ఆర్టీసీలో వీఆర్ఎస్: 50 శాతం స్టాప్ తగ్గించే యోచనలో ప్రభుత్వం

ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్ స్కీం(వీఆర్ఎస్) అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను 50 శాతానికి పరిమితం చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సంస్థలో 55 ఏండ్లు పైబడిన వారిని, 33 ఏండ్ల సర్వీసు ఉన్న వారిని ఇంటికి పంపనున్నట్లు సమాచారం. ఇక కొందరిని ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేయనున్నారు. ఇప్పటికే ఫైర్, పోలీస్ డిపార్ట్మెంట్లకు కొంత మంది డ్రైవర్లను అడ్జస్ట్ చేశారు. 

ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి..

సమ్మె తర్వాత ఆర్టీసీ విడుదల చేసిన డేటా ప్రకారం 49,733మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులను సగానికి తగ్గించాలని సర్కారు భావిస్తున్నది. మొదటగా వీఆర్ఎస్ను అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించనున్నారు.   అయితే 2019 సమ్మె టైంలోనే వీఆర్ఎస్ కింద ఉద్యోగులను సాగనంపాలని సర్కారు భావించింది. కానీ వివిధ కారణాలతో అది ముందుకు పడలేదు. 

ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు

ప్రస్తుతం వీఆర్ఎస్ కింద పోగా మరికొంత మందిని ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసే ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల స్టాఫ్ కావాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు ఆర్టీసీకి లెటర్లు రాసినట్లు సమాచారం. ఆర్టీసీ కూడా ఇస్తామని తిరిగి లెటర్లు రాసినట్లు తెలిసింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెండు వేల మంది డ్రైవర్లు కావాలని అడిగినట్లు సమాచారం. ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్కు 3వేల మంది దాకా డ్రైవర్లను పంపించారు. ఆ శాఖ ఇంకా కావాలని అడిగింది. డ్రైవర్లతో పాటు కండక్టర్లను ఇతర పనులకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
 
పైసలు ఇట్ల సమీకరిస్తరట

వీఆర్ఎస్కు డబ్బులను వివిధ మార్గాల ద్వారా సమీకరించాలని ఆలోచిస్తున్నారు. ఈ బడ్జెట్లో ఆర్టీసీకి ప్రభుత్వం రూ. 1,500 కోట్లు  కేటాయించింది. మరో 1,500 కోట్లు బడ్జెటేతర నిధులు సమకూర్చుతామని ప్రకటించింది. ఇప్పటికే అనేక చోట్ల ఆర్టీసీ ఆస్తులను లీజుకు ఇచ్చారు. మరికొన్ని చోట్ల ఆర్టీసీ ఆస్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని లీజుకు ఇచ్చి, డబ్బులు సమకూర్చుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇక బస్సుల సంఖ్య తగ్గడంతో ఇప్పుడున్న అన్ని డిపోలు అవసరంలేదనే భావనకు వచ్చారు. దగ్గరలో ఉన్న రెండు మూడు డిపోలను కలిపి ఒకటి లేదా రెండుగా మెర్జ్ చేసే చాన్స్ ఉంది. ఉదాహరణకు  పికెట్, కంటోన్మెంట్ డిపోలు కలిపి ఒకటిగా చేసే చాన్స్ ఉంది. ముషీరాబాద్లో మూడు డిపోలు ఉండగా, వాటిని మెర్జ్ చేయవచ్చని సమాచారం.