మేడారంలో వీవీఐపీ పాసులు చెల్లట్లే

మేడారంలో వీవీఐపీ పాసులు చెల్లట్లే

మేడారం(ములుగు), వెలుగు: ములుగు జిల్లా మేడారం జాతరలో ముందస్తుగా ఉన్నతాధికారులు జారీ చేసిన వీవీఐపీ పాసులు చెల్లడం లేదు. పాసులు ఉన్నవారిని పోలీసులు ప్రత్యేక క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. జిల్లా కలెక్టర్ ​జారీ చేసిన పాసులు చెల్లడంలేదని గురువారం పలువురు భక్తులు, జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవీఐపీ పాసులు ఉన్నవారిని కూడా వీఐపీ క్యూలైన్ నుంచి పంపించడం కరెక్ట్​కాదని వాపోయారు. అలాంటప్పుడు వీవీఐపీ పాసులను ఎందుకు ఇచ్చారని పోలీసులను ప్రశ్నించారు.

మేడారం జాతర డ్యూటీలో ఉన్న మీడియా ప్రతినిధులను గద్దెల ప్రాంగణంలోని మీడియా పాయింటుకు వెళ్లేందుకు కంట్రోల్​రూం నుంచి పోలీసులు అనుమతించలేదు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్​ మీడియా ప్రతినిధులు కవరేజీ కోసం కంట్రోల్ రూం నుంచి వెళ్లొచ్చని, ఫ్యామిలీతో దర్శనానికి వీఐపీ క్యూలైన్​ నుంచి వెళ్లొచ్చని చెప్పినప్పటికీ డ్యూటీ పోలీసులు పట్టించుకోవడంలేదు. దీంతో గురువారం పలువురు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం కన్నెపల్లిలో కవరేజీ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్టులు తిరిగి గద్దెల వద్దకు బైక్​పై వస్తుంటే పోలీసులు నిలిపివేశారు. దీంతో కొద్దిపాటి గొడవ జరిగింది. జర్నలిస్టు పాసులను కూడా పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.