రైతుల అన్ని డిమాండ్లకు మేం మద్దతిస్తున్నాం

రైతుల అన్ని డిమాండ్లకు మేం మద్దతిస్తున్నాం

రైతుల డిమాండ్లు అన్నింటికి తాము మద్దతిస్తున్నట్టు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) డిమాండ్‌లో న్యాయం ఉందన్నారు. రైతులపై పెట్టిన తప్పుడు కేసులన్నంటిని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలన్నారు. ఉద్యమంలో చనిపోయిన 700 మందికి పైగా రైతుల కుటుంబాలకు సాయం చేస్తామన్నారు. ఢిల్లీ సరిహద్దుల నుంచి ఎప్పుడు వెళ్లిపోవాలన్నది రైతుల ఇష్టమని చెప్పారు. నిరసనలు చేసేందుకు పంజాబ్‌ నుంచి వస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం స్టేడియాల్లో పెట్టాలని తమ ప్రభుత్వాన్ని కోరినప్పుడు గతంలో తాను అన్నా హజారేతో కలిసి ఆందోళనలు చేసినప్పటి రోజులు గుర్తొచ్చాయని కేజ్రీవాల్ అన్నారు. అన్నా హజారే, తాను అనేక రోజులు స్టేడియాల్లో గడపాల్సి వచ్చిందని, రాత్రి సమయాల్లో వచ్చి తమ నిరసనలను పోలీసులు భగ్నం చేసేవారని, అందుకే స్టేడియాల్లో నిరసనకారులను పెట్టేవాళ్లను చెప్పారు. ఈ విషయం తనకు ముందే తెలుసు కాబట్టి రైతులను కేంద్రం స్టేడియాల్లో పెట్టమన్నా తాను ఒప్పుకోలేదని, అందుకే కేంద్రం తమ ప్రభుత్వంపై కోపంగా ఉందని అన్నారు. రైతులు కొద్ది రోజులు నిరసనలు చేశాక వెనక్కి వెళ్లి పోతారని కేంద్రం భావించిందని, కానీ వాళ్లు పట్టువిడువకుండా ఏడాది పాటు స్వాతంత్ర్య పోరాటం స్థాయిలో కొట్లాడారని కేజ్రీవాల్ అన్నారు. చివరికి రైతులు విజయం సాధించారని, ఎట్టకేలకు కేంద్రం అగ్రి చట్టాలను వెనక్కి తీసుకుందని కేజ్రీవాల్ ప్రశంసించారు.