2 కిలోమీటర్లు కూడా పరుగెత్తలేరు..పాక్ ప్లేయర్ల ఫిట్‌నెస్ పై మండిపడ్డ చీఫ్ సెలెక్టర్

2 కిలోమీటర్లు కూడా పరుగెత్తలేరు..పాక్ ప్లేయర్ల ఫిట్‌నెస్ పై మండిపడ్డ చీఫ్ సెలెక్టర్

సాధారణంగా ఫీల్డింగ్ లోపాలు అనేవి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. అయితే పాకిస్థాన్ కి మాత్రం ఈ సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. టోర్నీ, సిరీస్ తో సంబంధం లేకుండా చెత్త ఫీల్డింగ్ చేస్తూ విమర్శకులకు గురవుతారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఫీల్డింగ్ లోపాలతో భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అంతకుమించిన చెత్త ఫీల్డింగ్ చేస్తూ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ చేజార్చుకున్నారు. ఈ విషయంపై తాజాగా పాక్ సెలక్టర్ వహాబ్ రియాజ్ సొంత ప్లేయర్ల పేలవ ఫీల్డింగ్ పై విరుచుకుపడ్డాడు. 

పాక్ ఆటగాళ్లు ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోవాలని..టీమ్ మేనేజ్‌మెంట్ దీనిపై చర్యలు తీసుకోవాలని రియాజ్ భావించాడు. ఫీల్డింగ్ తప్పిదాల వల్ల మేము టెస్టు సిరీస్ కోల్పోయాం. కొంతమంది ఆటగాళ్లయితే కనీసం 2 కిలోమీటర్లు కూడా పరిగెత్తలేరని పాక్ ప్లేయర్లపై మండిపడ్డాడు. కాగా.. ఈ సిరీస్ మొత్తం పాక్ ఆటగాళ్లు సునాయాసన క్యాచ్ లు మిస్ చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పర్వాలేదనిపించినా.. ఫీల్డింగ్ మాత్రం గల్లీ క్రికెట్ ను తలపించింది. 

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ 0-3 తేడాతో ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ అయింది. పాట్ కమిన్స్ కెప్టెన్ గా ఆసీస్ వరుసగా పెర్త్, మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల్లో విజయం సాధించింది. మెల్ బోర్న్ లో జరిగిన రెండో టెస్ట్, సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో గెలిచే అవకాశాన్ని ఫీల్డింగ్ తప్పిదాల వల్ల చేజార్చుకుంది. మరి ఇప్పటికైనా పాక్ ఫీల్డింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతారేమో చూడాలి.