పుణెలో భారీ వర్షం: గోడ కూలి 15మంది మృతి

పుణెలో భారీ వర్షం: గోడ కూలి 15మంది మృతి

మహారాష్ట్ర పుణెలో ఘోరం జరిగింది. అపార్ట్ మెంట్ గోడ కూలిపోయిన ఘటనలో 15 మంది చనిపోయారు. పుణె కొండ్వా ఏరియాలో ప్రమాదం జరిగింది. పుణేలో రాత్రి కురిసిన వర్షానికి కొండ్వా ఏరియాలో అపార్ట్ మెంట్ గోడ కూలిందని స్థానికులు చెప్తున్నారు. మృతుల్లో చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు. అపార్ట్ మెంట్  పక్కనే ఉన్న స్లమ్స్ పై గోడ కూలడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. గోడ కూలడంతో దాని పక్కనే పార్క్ చేసిన కార్లు కిందకు పడిపోయాయి. ఇలా జరగడం వల్లే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది.

మహారాష్ట్రలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ప్రధాన నగరాలైన ముంబయి, పుణేలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది.  ఇక నిన్న ముంబయి, థానేలను భారీ వర్షం కుదిపేసింది. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబయి, థానే నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపించాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం జరిగింది. రాంత్రంతా కూడా వర్షం కురిసింది. ఉదయం కూడా అక్కడక్కడా వర్షం మొదలైంది. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద కార్పొరేషన్ సిబ్బంది చర్యలు చేపట్టారు. నగరంతో పాటు శివారు ప్రాంతాలైన విహార్, జుహు, ములుంద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెంబూర్ ప్రాంతంలో గోడ కూలడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. అయితే ఎవరూ గాయపడలేదని సమాచారం.