కందాల యువసేన పేరుతో వాల్ రైటింగ్స్

కందాల యువసేన పేరుతో వాల్ రైటింగ్స్
  • ఎమ్మెల్యే అనుచరుల ప్రచార హోరు 
  • తుమ్మల, షర్మిలను ఇరుకున పెట్టే ప్లాన్
  • రానున్న ఎన్నికలే టార్గేట్​

ఖమ్మం, వెలుగు: రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు తొమ్మిది నెలల గడువుంది. జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో మాత్రం అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ఒకవైపు బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీ పేరును ప్రకటించి కేసీఆర్ ముందుకు పోతుంటే, మరోవైపు అదే పార్టీలోని ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా లోకల్, నాన్ లోకల్ అంటూ కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారు. తమను గొప్పగా చెప్పుకునేందుకు, ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ‘మట్టికైనా మనోళ్లు కావాలి, పరాయి లీడర్లు ఎందుకు’ అంటూ జనాలను ఆయన ఉసి గొలుపుతున్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా లోకల్ టైగర్ అంటూ కందాల యువసేన పేరుతో ఆయన అనుచరులు రాయించిన వాల్ రైటింగ్స్ చర్చనీయాంశమయ్యాయి. మండల కేంద్రాలు, పల్లెటూళ్లు అనే తేడా లేకుండా ప్రతి చోటా రైటింగ్స్ తో నింపేశారు. కల్వర్టులు, మొండి గోడలు, ప్రహారీలు, నలుగురు జనాలు చూసే అన్ని చోట్లా రాశారు. దీంతో ఇది ప్రత్యర్థులపై మానసికంగా పైచేయి సాధించేందుకు, మిగిలిన వాళ్లు నాన్ లోకల్ అనే అంశాన్ని చర్చకు తెచ్చేందుకు చేసిన ఎత్తుగడేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు డైరెక్టుగా కందాల ఉపేందర్ రెడ్డి చేసిన కామెంట్లు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. 

పోటీకి లైన్​లో హేమాహేమీలు..

ఇటీవల పాలేరు సెగ్మెంట్ రాజకీయంగాస్టేట్ వైడ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. అధికార బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య విభేదాల కారణంగా పాపులరైంది. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చిన కందాలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కుతుందా, లేక గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిన తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ టికెట్ తెచ్చుకుంటారా అనే చర్చ సాగుతోంది. ఇద్దరూ పోటీ చేస్తామని ప్రకటించడంతో ఎవరు పార్టీ మారతారు, ఎవరు ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని అనౌన్స్ చేయడం, ఇటీవల ఆ నియోజకవర్గ పరిధిలో పార్టీ ఆఫీస్ నిర్మాణానికి భూమిపూజ చేయడంతో విషయం కన్ఫామ్ అయింది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ తో పొత్తు ఖాయమైతే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా పాలేరులో పోటీకి మక్కువ చూపిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇంత మంది హేమాహేమీలు పాలేరుపైనే ఫోకస్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సెగ్మెంట్ పై చర్చ జరుగుతోంది.

 ముగ్గురూ సొంత ప్లాన్లలో...

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడుంటాయనే అంశంపై ఇంకా క్లారిటీ రాకున్నా కందాల, తుమ్మల, వైఎస్ షర్మిల పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన ఇద్దరు లీడర్లతో పోల్చుకుంటే కందాలకి స్థానికత అంశం కలిసొస్తుందని ఆయన అనుచరులు అంటున్నారు. కందాల సొంతూరు కూసుమంచి మండలం రాజుపేట. గ్రామంలో ఆయనకు పూర్వీకుల నుంచి వస్తున్న వ్యవసాయ భూములు, సొంతిల్లు కూడా ఉన్నాయి. షర్మిలది ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయ. అయితే తాను తెలంగాణ కోడలినని, హైదరాబాద్ లోనే పుట్టి పెరిగానని షర్మిల చెప్పుకుంటున్నారు. పాలేరు గడ్డ ఇకపై తన అడ్డా అని చెప్పుకునేందుకు నియోజకవర్గ పరిధిలోని కరుణగిరిలో పార్టీ ఆఫీస్ కమ్ గెస్ట్ హౌస్ ను నిర్మిస్తున్నారు. గతేడాది ఆ బిల్డింగ్ కు భూమిపూజ చేశారు. ఇటీవల మరో బిల్డింగ్ ను అద్దెకు తీసుకొని ఆఫీస్​ను తెరిచారు. తుమ్మల స్వస్థలం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గండుగులపాడు కాగా, 2016 నుంచి 2018 వరకు పాలేరు ఎమ్మెల్యేగా పనిచేసినా పాలేరు పరిధిలో సొంతిల్లు లేదు. దీంతో గతేడాది ఆయన ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. దీంతో లోకల్ ఫ్లేవర్ తనకు కలిసొస్తుందనే ఆలోచనతోనే అన్ని ఊర్లలో వాల్ రైటింగ్స్ ద్వారా కందాల అనుచరులు ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ప్లాన్​ బెడిసికొడుతుందా..?

వాల్ రైటింగ్స్ ద్వారా స్థానికత అంశాన్ని లేవనెత్తడం, బయటోళ్లు అనే కామెంట్లు చేయడం కందాలకు బూమరాంగ్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత పొరుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో దానికి విరుద్ధంగా స్థానికతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హైలైట్ చేస్తే, మిగిలిన సెగ్మెంట్లలో ఆ ప్లాన్ ఎదురుతన్నే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి.