ఫోన్‌‌పేతో వాల్‌‌మార్ట్‌‌కు కాసుల వర్షం

ఫోన్‌‌పేతో వాల్‌‌మార్ట్‌‌కు కాసుల వర్షం

బెంగళూరు : అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌‌మార్ట్‌‌కు డిజిటల్ పేమెంట్ సర్వీస్ సంస్థ ఫోన్‌‌పే కాసుల వర్షం కురిపిస్తోంది. అనూహ్యమైన రీతిలో ఫోన్‌‌పే వాల్యుయేషన్ దూసుకుపోతోంది. దేశంలో అతిపెద్ద ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్‌‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌‌మార్ట్  చేజిక్కించుకున్నప్పుడు ఈ సంస్థ  ఫోన్‌‌పేను పెద్దగా పట్టించుకోలేదు. ఫ్లిప్‌‌కార్ట్‌‌లో భాగమైన ఫోన్‌‌పే ప్రస్తుతం దేశంలో టాప్ స్టార్టప్‌‌లలో ఒకటిగా నిలుస్తోంది. దీని వ్యాపారాలు కూడా అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. దీంతో వాల్‌‌మార్ట్‌‌కు అనుకోని రీతిలో ప్రయోజనం చేకూరుతున్నట్టు తెలిసింది. ఇటీవల ఫ్లిప్‌‌కార్ట్ బోర్డు ఫోన్‌‌పే ప్రైవేట్ లిమిటెడ్‌‌ను కొత్త సంస్థగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాక బయట ఇన్వెస్టర్ల నుంచి 100 కోట్ల డాలర్ల వరకు అంటే రూ.6,858 కోట్ల వరకు సేకరించాలనుకుంది. దీంతో ఫోన్‌‌పే వాల్యుయేషన్ 10 బిలియన్ డాలర్లకు(రూ.68,580 కోట్లకు) చేరుకుంటుందని సంబంధిత వర్గాలు చెప్పాయి.  వచ్చే రెండు నెలల్లో ఫండింగ్ పూర్తవుతుందని తెలిపాయి. ఫండింగ్ సేకరించే చర్చలు ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి. సెపరేట్ ఇన్వెస్టర్ బేస్‌‌తో ఫోన్‌‌పే యూనిట్‌‌ స్వతంత్ర సంస్థగా ఏర్పాటు కాబోతోందని, వాల్‌‌మార్ట్‌‌కు సొంతమైన ఫ్లిప్‌‌కార్టే దీనికి వాటాదారునిగా ఉంటుందని చెప్పాయి. అయితే ఈ విషయంపై వాల్‌‌మార్ట్, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు స్పందించలేదు. ఫోన్‌‌పే కోసం స్ట్రాటజిక్ లేదా ఫైనాన్సియల్ ఇన్వెస్టర్స్‌‌ను వాల్‌‌మార్ట్‌‌ వెతుకుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ అయితే గ్రోత్ పరంగా బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఫోన్‌‌పే నుంచి పాఠాలు నేర్చుకుని, ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆపరేషన్స్‌‌లో అమలు చేయాలని
వాల్‌‌మార్ట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిధుల సేకరణతో ఫోన్‌‌పే వృద్ధినే లక్ష్యంగా పెట్టుకుంది వాల్‌‌మార్ట్.

నాలుగింతలు పెరిగిన లావాదేవీలు…

ఫోన్‌‌పే దేశంలోనే లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీల్లో ఒకటిగా దూసుకుపోతోంది. వాల్యూమ్, లావాదేవీల విషయాలలో గత ఏడాది కాలంగా నాలుగింతల మేర పెరిగింది. ఫోన్‌‌పేను వాడుతూ దేశంలోని చాలా మంది వినియోగదారులు తమ మనీని వ్యాపారాలకు, ఇతరులకు ట్రాన్స్‌‌ఫర్ చేస్తున్నారు. ఫోన్‌‌పే తక్కువ అంచనావేసే ఆస్తి కాదని క్యాపిటల్ మార్కెట్స్ కీబ్యాంక్ ఎడ్వర్ వైరుమా అన్నారు. అంటే ఫోన్‌‌పే వ్యాపారాలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయన్నారు. దీని వ్యాపారాల విలువ 14 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనావేశారు.

లక్ష కోట్ల డాలర్లకు ఇండియా డిజిటల్ పేమెంట్లు..

ఇండియాలో డిజిటల్ పేమెంట్లు 2023 నాటికి లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటాయని, ప్రస్తుతం ఇవి 200 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు క్రెడిట్ సూజ్ గ్రూప్ ఏజీ అంచనావేస్తోంది. ఫోన్‌‌పే, పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే మాత్రమే కాక మరికొన్ని రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి వాట్సాప్ కూడా అడుగుపెట్టబోతుంది.