
వనపర్తి, వెలుగు: వరుసగా రెండు, మూడు రోజులు వర్షాలు కురిస్తే చాలు వనపర్తి పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెండు, మూడు దశాబ్దాలుగా వరద ముప్పు పీడిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. వరద ముంపు సమస్య పరిష్కారానికి గత పాలకులు ప్రణాళికలు రచించినా, ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
వర్షాకాలం అంటేనే భయం..
వనపర్తి జిల్లా కేంద్రం అయ్యాక జనాభా, ఆవాసాలు పెరిగి పట్టణం విస్తరించినా, వరద ముంపు మాత్రం తొలగిపోలేదు. మర్రికుంట వద్ద ఉన్న కాలనీల్లో వరద నీరు చేరి అక్కడి ప్రజలు రోజుల తరబడి ఇబ్బంది పడుతుంటారు. 2020 లో కరోనా సమయంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, కొన్ని రోజుల పాటు రాకపోకలు స్తంభించాయి.
కొంతైనా ముప్పు తప్పేనా?
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వనపర్తి మున్సిపాలిటీ అధికారులు జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు కాలువతో పాటు ఇతర కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ప్రొక్లెయినర్‌తో తీయిస్తున్నారు. వర్షాలు కురవడానికి ముందే కాల్వలను శుభ్రం చేస్తుండడంతో, ఈ సారి వరద ముంపు ప్రమాదం పెద్దగా ఉండకపోవచ్చని ప్రజలు అంటున్నారు.
గతంలో మర్రికుంట వద్ద కొన్ని ఇళ్లు వరదలో చిక్కుకోగా, వాటిలో చాలా ఇండ్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని గుర్తించారు. ఆ ఇండ్లను ఖాళీ చేయాలని మున్సిపల్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు. ఆ తరువాత రాజకీయ నాయకుల జోక్యం చేసుకోవడంతో.. ఖాళీ చేయాల్సిన ఇండ్లకు ముందు వరద నీరు రాకుండా కొత్తగా కట్ట నిర్మించారు.
అటకెక్కిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ..
- 2009 ఎన్నికల ముందు అప్పటి సీఎం వైఎస్సార్ వనపర్తిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరు కాక, పనులు జరగక అలాగే ఉండిపోయింది. ఆ తరువాత సర్కారు మారినా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరగలేదు. స్టార్మ్ వాటర్ డ్రైనేజీని నిర్మించి వరద నీరు పట్టణంలో నిల్వ ఉండకుండా చూస్తామని గత పాలకులు చెప్పినా, అది హామీగానే మిగిలిపోయింది.
- జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న లింగిరెడ్డికుంట మున్సిపల్ కాంప్లెక్స్‌లోకి వర్షం పడితే చాలు వరద నీరు పోటెత్తుతుంది. 2009లో కురిసిన భారీ వర్షాలకు కాంప్లెక్స్ సెల్లార్‌లోని షాపులు పూర్తిగా మునిగిపోయాయి. అప్పటి నుంచి ఎప్పుడు వర్షం పడినా దుకాణాదారులు ఆందోళన చెందుతారు.
- తాళ్లచెరువు వాగు కుచించుకుపోవడంతో.. చెరువు నిండి పారిన వరద నీరు సాఫీగా వెళ్లే దారి లేక వాగు వెంట ఉండే కాలనీల్లోకి చేరుతుంది. దీంతో కాలనీలు నీటి కుంటలుగా దర్శనమిస్తాయి. వారం, పది రోజుల వరకు వరద నీరు ఉంటుంది. ఈ వాగు వంద ఫీట్ల వెడల్పుతో పారాల్సి ఉండగా, కాలువ వెంబడి ఇరువైపులా ఆక్రమణలతో 30 నుంచి -40 ఫీట్లకు కుచించుకుపోయింది. ఎప్పుడు వర్షం పడినా కాలువ నిండుగా పారుతుంది. చెత్తాచెదారం కల్వర్టుల వద్ద అడ్డుపడి వరద పోటెత్తుతుంది. గతంలో ఒకరిద్దరు వరద నీటిలో కొట్టుకుపోయిన సందర్భాలూ ఉన్నాయి.
- సాయినగర్, వెంగళరావునగర్, బ్రహ్మంగారివీధి, ప్రభుత్వ ఆసుపత్రి, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం తదితర ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే జలమయం అవుతాయి. ఎన్నో ఏండ్ల కింద పీర్ల గుట్ట నుంచి వచ్చే వర్షపు నీరు వెళ్లేందుకు నిర్మించిన డ్రైనేజీలూ ఆక్రమణకు గురవడంతో, వరద నీరు కాలనీల్లోకి పోటెత్తుతుంది.