ఇరాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధం ముగిసింది.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన

ఇరాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధం ముగిసింది.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన
  • వారాంతంలో పీస్​డీల్​పై ఐరోపాలో సంతకాలు 
  • అణ్వాయుధాల తయారీ స్వస్తికి ఇరాన్ అంగీకారం 
  • ఇది చాలా బలమైన, సమగ్రమైన ఒప్పందమని వెల్లడి
  • డీల్​పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్ 
  • యురేనియం, హార్మూజ్​పై హక్కులు, నిధుల విడుదల కోసం పట్టు

టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​ప్రకటించారు. ఆ దేశంతో యుద్ధాన్ని ముగించే ఒప్పందం దాదాపు పూర్తయిందని.. ఈ వారాంతంలో ఐరోపాలో పీస్​డీల్​పై సంతకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇరాన్ ఆయిల్​ఇండస్ట్రీకి ఆయువుపట్టు అయిన ఖర్గ్​ఐలాండ్​ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన కొద్ది గంటలకే ఆ దేశంపై సైనిక దాడులను విరమించుకున్న ట్రంప్.. ఆ తర్వాత ఇరాన్‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం దాదాపు పూర్తయిందని వెల్లడించారు. 

ఐరోపాలో జరగబోయే ఈ ఒప్పంద సంతకాల కార్యక్రమానికి అమెరికా వైస్​ప్రెసిడెంట్​జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. తాజా చర్చల గురించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్ తదితర పశ్చిమాసియా దేశాల నాయకులతో తాను మాట్లాడినట్టు చెప్పారు. ఆ తర్వాత, జార్జియా గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ బర్ట్ జోన్స్ మద్దతుగా నిర్వహించిన టెలి-ర్యాలీలో ప్రసంగిస్తూ.. ఇరాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధాన్ని అమెరికా ముగించిందని ట్రంప్ ప్రకటించారు.

 ‘మీరు విన్నారో లేదో తెలియదు కానీ.. మేము ఈ రోజు (గురువారం) ఇరాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధాన్ని ముగించాం. అణు ఆయుధాన్ని ఎప్పటికీ కలిగి ఉండకూడదన్న మా డిమాండ్‌‌‌‌‌‌‌‌కు వారు అంగీకరించారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ ఈ ఒప్పందాన్ని సానుకూలంగా స్వీకరిస్తోందని, త్వరలోనే సంతకాలు జరుగుతాయని  పేర్కొన్నారు. 

ఒప్పందం ఖరారైన తర్వాత హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని చెప్పారు. ‘ఇది చాలా బలమైన సమగ్రమైన అవగాహన ఒప్పందం. ఇది కొంతవరకు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ.. కచ్చితంగా కార్యరూపం దాల్చబోతోంది’ అని ట్రంప్ అన్నారు. 

ఒప్పందానికి ఇరాన్ ఎలా అంగీకరించిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘వారు చాలా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఒప్పందం చేసుకోవాలని నాకంటే వారికే ఎక్కువ ఆసక్తి ఉంది’ అని తెలిపారు.  అయితే, ఈ ఒప్పందం విషయంపై ఇరాన్ భిన్నమైన ప్రకటన చేసింది. దీనిపై తాము ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

పీస్ డీల్ కు వేదికగా జెనీవా?  

అమెరికా, ఇరాన్ మధ్య జరగబోయే చరిత్రాత్మక ఒప్పందానికి స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌లోని జెనీవా వేదిక కానుందని సమాచారం. వచ్చేవారం జెనీవాలో.. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగే అకాశం ఉందని.. ఆదివారం (ఈ నెల 14) నాటికి ఈ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు జరిగే చాన్స్ ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు నివేదించాయి. ఈ ఒప్పందంపై అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ తరఫున ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ సంతకాలు చేయవచ్చని తెలుస్తోంది.

శాంతి ఒప్పందానికి ఇరాన్ షరతులు

అమెరికాతో చేసుకోబోయే ఒప్పందంలో యురేనియం శుద్ధి హక్కును, హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను రక్షించుకోవాలని ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది. పీస్​డీల్​కు ముసాయిదా దాదాపు సిద్ధమైందని అమెరికా  ట్రంప్ చెప్తున్నప్పటికీ.. ఇరాన్ మాత్రం కొన్ని షరతులను 
విధిస్తోంది. భవిష్యత్తులో అమెరికాతో కుదిరే ఏ ఒప్పందంలోనైనా యురేనియం శుద్ధిని కొనసాగించే హక్కును, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఉంచుకునే హక్కును,  హార్మూజ్ జలసంధిపై నియంత్రణను నిలుపుకోవడం తమకు అత్యంత ముఖ్యమని ఇరాన్ శుక్రవారం స్పష్టం చేసింది. 

ఓ వైపు త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందని ట్రంప్ పేర్కొనగా.. ఇరాన్​తాజాగా వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఇంకా కీలకమైన విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఇర్నా’ కథనం ప్రకారం.. ఎంఓయూ కుదిరిన తర్వాత, ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గమైన హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల రాకపోకలపై తమకే అధికారం ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. 

ముసాయిదాలోని ముఖ్యాంశాలివే.. 

తాజా ముసాయిదా వివరాలను ఇరాన్ మీడియా సంస్థ ‘మెహర్ న్యూస్ ఏజెన్సీ’ లీక్ చేసింది. అందులో ప్రధానంగా ఫ్రీజ్​అయిన 24 బిలియన్​ డాలర్ల ఇరాన్ ఆస్తుల విడుదల.. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపై ఉన్న అమెరికా ఆంక్షల ఎత్తివేత.. ఇరాన్ ఓడరేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనం రద్దు.. ఇరాన్ అణు కార్యక్రమంపై 60 రోజుల చర్చల వ్యవధి.. ఇరాన్ పునర్నిర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల సహాయం.. లెబనాన్‌‌‌‌‌‌‌‌తో సహా పలు రంగాలలో కొనసాగుతున్న శత్రుత్వానికి ముగింపు తదితర అంశాలు ఉన్నాయి

. అయితే, ఫ్రీజ్​చేసిన నిధులలో సగం విడుదల చేసి, చమురు ఎగుమతులపై ఆంక్షలు సడలించి, నౌకాదళ పరిమితులను తొలగించే వరకు తుది చర్చలు ప్రారంభం కావని ఇరాన్ స్పష్టం చేసింది.