ఉక్రెయిన్ పై యుద్ధ మేఘాలు!

ఉక్రెయిన్ పై యుద్ధ మేఘాలు!

కీవ్/బ్రస్సెల్స్: ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశాలైన రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల్లో లక్ష మంది సైనికులను రష్యా మోహరించింది. ఉక్రెయిన్‌‌కు మద్దతుగా నాటో బలగాలు రంగంలోకి దిగినా.. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షల హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వెనక్కి తగ్గడం లేదు. పైపెచ్చు.. జాయింట్ మిలటరీ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ పేరుతో పక్క దేశమైన బెలారస్‌‌కు కూడా బలగాలను రష్యా పంపింది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలటరీ ద్వారా దాడి చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని, తమ దేశాన్ని అస్థిరపరచాలని చూస్తోందని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా ఉక్రెయిన్‌‌లోని తమ డిప్లమాట్లను అమెరికా, బ్రిటన్ దేశాలు వెనక్కి రప్పించాయి.
పోటాపోటీ మోహరింపులు
ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా తమ సైనికులను మోహరిస్తే.. నాటో కూడా బలగాలను రంగంలోకి దింపింది. ఈస్టర్న్ యూరప్‌‌లో మరిన్ని షిప్పులు, ఫైటర్ జెట్లను సిద్ధంగా ఉంచింది. ‘‘నాటోకు మరిన్ని ఫోర్సెస్‌‌ను అందిస్తున్న మిత్రదేశాలను స్వాగతిస్తున్నా. తమ మిత్ర దేశాలను కాపాడుకునేందుకు, దాడుల నుంచి డిఫెండ్ చేసేందుకు అవసరమైన చర్యలను నాటో కొనసాగిస్తుంది’’ అని వెస్టర్న్ మిలటరీ అలయన్స్ సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌‌బర్గ్ అన్నారు. ఉక్రెయిన్ విషయంలో దూకుడు తగ్గించుకోవాలని, దాడికి దిగొద్దని రష్యాను అమెరికా, యూరోపియన్ యూనియన్ హెచ్చరిస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని ఎకనమిక్ ఆంక్షలు విధిస్తామని చెప్తుతున్నాయి. తమకు దాడి చేసే ఉద్దేశమే లేదని రష్యా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. కానీ మిలటరీ ఎక్సర్‌‌‌‌సైజ్ పేరుతో బల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది.
ఎందుకీ ఉద్రిక్తతలు
2013లో యూరోపియన్ యూనియన్‌‌తో ఉక్రెయిన్‌‌ చారిత్రక రాజకీయ, వాణిజ్య ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి రష్యాతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. రష్యా అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్.. ఈయూతో చర్చలను నిలిపేశారు. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌ భగ్గుమంది. ఈ నిరసనలు చల్లారక ముందే 2014లో ఉక్రెయిన్ పక్కనున్న క్రిమియాను రష్యా కలిపేసుకుంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. రష్యా నుంచి తనను తాను రక్షించుకునేందుకు యూరోపియన్ యూనియన్, అమెరికాతో స్నేహం మొదలుపెట్టింది ఉక్రెయిన్. 2024లో ఈయూ మెంబర్‌‌‌‌షిప్‌‌ పొందేందుకు అప్లయ్​ చేసుకోవాలని, నాటోలో జాయిన్ కావాలని భావిస్తోంది. నాటోతో సంబంధాలను అడ్డుకునే హక్కు రష్యాకు లేదని వాదిస్తోంది. దీన్నే రష్యా వ్యతిరేకిస్తోంది. నాటోలో ఉక్రెయిన్‌‌ను చేర్చుకోవద్దని, ఈస్టర్న్‌‌ యూరప్‌‌లో మోహరించిన ట్రూపులను, ఆయుధాలను అమెరికా, దాని మిత్రపక్షాలు వెనక్కి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్‌‌కు నాటో సపోర్టు వల్ల ఆయుధ సరఫరా, మిలటరీ ట్రైనింగ్ పెరుగుతోందని, తమ దేశంలోని ఈస్టర్న్ భాగంలో ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై అమెరికా, రష్యా మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రష్యా బలప్రదర్శన ఉద్రిక్తలను పెంచుతోంది