దుబ్బాకలో వేడెక్కుతున్న రాజకీయం

దుబ్బాకలో వేడెక్కుతున్న రాజకీయం
  • కొత్త ప్రభాకర్, రఘునందన్ మధ్య మాటల యుద్ధం
  • రేపు దుబ్బాకలో నలుగురు మంత్రుల పర్యటన

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు : దుబ్బాక రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఎంపీ కొత్త ప్రభాకర్​, ఎమ్మెల్యే రఘునందన్​ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో ఇరుపార్టీల క్యాడర్​ కూడా తగ్గేదేలే అంటోంది. సోషల్​ మీడియాలో, క్షేత్ర స్థాయిలోనూ గొడవలు, అడ్డగింతలకు కార్యకర్తలు యత్నిస్తున్నారు. ఒక్కోసారి ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న సందర్భాలున్నాయి.  గత ఆరు నెలల కాలంలో ఇరు పార్టీలూ క్యాడర్​ను పెంచుకొనేలా తీవ్రంగా ప్రయత్నించాయి. నిన్నామొన్నటి దాకా బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటాపోటీ చేరికలు జరుగగా.. ఇప్పుడు లీడర్లు బహిరంగ వేదికలపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. 

లీడర్లు.. సవాళ్లు.. 

దుబ్బాక నుంచి బీఆర్ఎస్ టికెట్టు ఆశిస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర రెడ్డి మొన్నటి వరకూ పార్టీ చేరికల్లో బిజీగా కనిపించారు. కానీ, ఇప్పుడు రూటు మార్చారు. ఎమ్మెల్యే రఘునందన్​ రాజీనామా చేసి కార్పొరేటర్​గా గెలవాలని హాట్​ కామెంట్లు చేయడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. దీంతోపాటు గతంలో దౌల్తాబాద్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం ఇరు పార్టీల లీడర్ల మధ్య పెద్ద రాద్దాంతాన్నే సృష్టించింది. గొల్లపల్లి గ్రామంలో శిలాఫలకం పై స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు లేకపోవడంతో  గొడవ జరిగింది. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం కొత్త ప్రభాకర్​ రెడ్డి నేరుగా ఎమ్మెల్యే రఘునందన్ రావుపై సవాల్ విసిరాడు. సిద్దిపేట కేంద్రంగానే ఒకరిపై ఒకరు నేరుగా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి హరీశ్​ రావును ఓడిస్తానని ప్రగాల్బాలు పలుకుతున్న వ్యక్తిని సిద్దిపేట లో కౌన్సిలర్ గా పోటీ చేసి గెలువాలని, ఎన్నిక కోసం తానే స్వయంగా ఎవరైనా ఒక కౌన్సిలర్ ను బతిమాలైనా రాజీనామా చేయించి ఉప ఎన్నిక తెప్పిస్తానని రఘునందన్ రావును ఉద్దేశించి అన్నారు. సిద్దిపేటలో కౌన్సిలర్ గా గెలువలేని వ్యక్తి మంత్రిపై పోటీ చేయడం ఏంటని ఆయన మండిపడ్డాడు. ఎంపీ వ్యాఖ్యల పై బీజేపీ శ్రేణులు స్పందించారు. రెండు రోజుల క్రితం రైతాంగ సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. సిద్దిపేటలో పబ్బులు కావాలని అడిన వ్యక్తికి స్థానిక ప్రజలు, రైతాంగ సమస్యలు తెలియవని ఎంపీ ప్రభాకర రెడ్డికి చురకలంటించారు. దమ్ము,  ధైర్యం వుంటే మెదక్ ఎంపీ పదవికి ప్రభాకర రెడ్డి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే బీఆర్ఎస్ గెలుస్తోందో, బీజెపీ గెలుస్తుందో తెలుసుకోవాలని ప్రతి సవాల్ చేశారు. నిజామాబాద్ నుంచి దుబ్బాకకు బతకడానికి వచ్చిన వ్యక్తి దుబ్బాకలో తనతో కొట్లాడుతానంటే బరి గీసి నిలబడుతానన్నారు.

బలప్రదర్శనకు వేదికగా  ప్రారంభోత్సవాలు

దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ , బీజేపీ శ్రేణులకు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు వేదికగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలనే దిశగా బీఆర్ఎస్​, పట్టు నిలుపుకోవాలనే బీజేపీ ప్రయత్నాలు స్థానిక రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. దుబ్బాకలో బస్టాండ్ పనుల శంఖుస్థాపన,  ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం  నాటి నుంచి మొన్న జరిగిన భూంపల్లి అక్బర్ పేట తహసీల్దార్​ కార్యాలయ ప్రారంభోత్సవాలు పోటీ పోటీ రాజకీయాలకు వేదికగా మారాయి. దీనికి తోడు నియోజకవర్గ అభివృద్ధి నిధుల మంజూరయ్యాయని ఇరు పార్టీల నేతలు తమ ప్రయత్నాల వల్లనే నిధులు మంజూరైనాయని చెప్పుకుంటూ పై చేయి సాధించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సమయంలో ఇరు పార్టీల శ్రేణులు పోటీ పోటీగా నినాదాలు చేయడంతో పలు సందర్భాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  భూంపల్లి అక్బర్ పేట తహసీల్దార్​ కార్యాలయ ప్రారంభోత్సవ సమయంలో ఇరు వర్గాలు పోటీ పోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు.  ఆరు నెలల క్రితం తొగుట మండలం గుడికందుల లో ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.