చనిపోయేదాకా ఉరి తీయండి..ప్రేమించిన యువతి పేరెంట్స్ హత్య కేసులో.. యువకుడికి వరంగల్ కోర్టు శిక్ష

చనిపోయేదాకా ఉరి తీయండి..ప్రేమించిన యువతి పేరెంట్స్ హత్య కేసులో.. యువకుడికి వరంగల్ కోర్టు శిక్ష

 

  • 2024 జులై 11న వరంగల్‍ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఘటన
  • ఉన్మాది దాడిలో దంపతులు మృతి.. అక్కాతమ్ముళ్లకు తీవ్ర గాయాలు

వరంగల్/నర్సంపేట, వెలుగు: ప్రేమించిన యువతితో పెళ్లిని కాదన్నందుకు ఆమె తల్లిదండ్రులను వేటకొడవలితో నరికి క్రూరంగా హత్యచేసిన నిందితుడిని చనిపోయేదాకా ఉరి తీయాలని వరంగల్‍ ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి మైత్రేయి సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడికి రూ. 5 వేల జరిమానా కూడా విధించారు. వరంగల్‍ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్‍ తండాలో 2024 జులై 11 తెల్లవారుజామున బానోతు​సుగుణ, శ్రీనివాస్​ దంపతులను మహబూబాబాద్‍ జిల్లా గూడురు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు హతమార్చాడు. 

అడ్డువచ్చిన ప్రేయసి బానోత్‍ దీపిక, ఆమె తమ్ముడు బానోత్‍ మదన్‍లాల్‍ పైనా దాడికి పాల్పడ్డాడు. బానోతు ఈరమ్మ ఫిర్యాదుతో అప్పటి నెక్కొండ సీఐలు చంద్రమోహన్‍, శ్రీనివాస్‍ విచారణ చేపట్టి చార్జ్​షీట్​ దాఖలు చేశారు. ప్రత్యేక అదనపు పబ్లిక్‍ ప్రాసిక్యూటర్‍ బృందాదేవి వాదనలు వినిపించారు. ఈ కేసులో బుధవారం తీర్పు వెలువడింది. పదహారు చింతలతండాకు చెందిన బానోతు శ్రీనివాస్‍ (50), సుగుణ (45) దంపతులకు కూతురు దీపిక (21). కొడుకు మదన్‍లాల్‍(17) ఉన్నారు. దీపిక హనుమకొండ పింగిళి కాలేజీలో డిగ్రీ చదువున్న సమయంలో గుండెంగ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ మేకల నాగరాజుతో పరిచయం ఏర్పడింది. 

అది ప్రేమగా మారడంతో 2023 అక్టోబర్​లో నాగరాజు రహస్యంగా దీపికను పెళ్లి చేసుకున్నాడు. తమ కూతురు కనిపించడంలేదని శ్రీనివాస్‍ హనుమకొండ, సుబేదారి పీఎస్​లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‍ కేసు నమోదు చేశారు. పోలీసులు ఇరువురిని పిలిపించి మాట్లాడారు. ఇద్దరు మేజర్లే కావడం, తాము కలిసి ఉంటామని చెప్పడంతో పంపించేశారు. 

విడాకులకు ప్రేయసి తల్లిదండ్రులే కారణమని..

మూడు నెలల తర్వాత దీపిక, నాగరాజు మధ్య గొడవలు జరిగాయి. 2024 జనవరిలో వారు పోలీసులను ఆశ్రయించారు. పెద్ద మనుషులు పంచాయితీ చేసి విడాకులు ఇప్పించారు. దీపికతో తాను విడిపోవడానికి ఆమె తల్లిదండ్రులే కారణమని కోపం పెంచుకున్న నాగరాజు 2024 జులై 10 అర్ధరాత్రి వేటకత్తితో దీపిక ఇంటికి వచ్చాడు. పడుకున్న దీపిక తల్లిదండ్రులను కొడవలితో నరికేశాడు. వారి కుమారుడు మదన్‍లాల్, అడ్డొచ్చిన దీపికపై దాడి చేశాడు. దాడిలో సుగుణ స్పాట్లోనే చనిపోగా.. శ్రీనివాస్‍ హస్పిటల్‍ తరలిస్తుండగా మరణించాడు. నిందితుడు పరారయ్యాడు.