
వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది ప్రధానంగా దొంగతనాలపై ఫోకస్ పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్‍సింగ్ ఆదేశించారు. మంగళవారం ఆయన హనుమకొండ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‍లో అధికారులతో క్రైం రివ్యూ నిర్వహించారు. స్టేషన్ల వారీగా నమోదైన చోరీలు, కేసులు, నిందితుల అరెస్ట్, సొమ్ము రికవరీ, పెండింగ్ కేసులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో ఆస్తికి సంబంధించి నేరాల నియంత్రణలో చోరీలకు చెక్ పెట్టాలన్నారు. టెక్నాలజీ పాటు శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తుతో ముందుకెళ్లాలన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో మూగజీవాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల వినియోగం ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించి, భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో డీసీపీ షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, జనగామ ఏఎస్పీ చైతన్య, అడిషనల్ డీసీపీ రవి, సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.