
- భారీగా ఖాళీ కానున్న రేషన్ గోదాములు
- ఈ పాస్ యంత్రాలకు మినహాయింపు ఇవ్వాలంటున్న రేషన్ డీలర్లు
- లేకపోతే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం
మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మూడు నెలల రేషన్ ఒకే సారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. దీంతో ఆయా జిల్లాల సివిల్ సప్లై ఆఫీసర్లు రేషన్ బియ్యం పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలంటే సుమారు 31 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. కొత్తగా రేషన్ కార్డుల ఆమోదంతో ఈ కోటా మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికనుగుణంగా విడతల వారీగా బియ్యం రవాణా చేసేందుకు ఆఫీసర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
నిల్వ చేసేందుకు స్థలం ఏదీ?
గ్రామాలు, పట్టణాల్లో రేషన్ షాపుల్లో కేవలం ఒక నెల రేషన్ బియ్యం స్టాక్ ఉంచడం కోసం మాత్రమే స్థలం ఉంటుంది. మూడు నెలల కోటాకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకే సారి దించుకుని నిల్వ చేయడం ఇబ్బందికరంగా మారనుంది. వర్షాకాలం కావడంతో క్షేత్ర స్థాయిలో మరింత ఇబ్బంది కలగనుంది. ప్రతినెలా ఈ పాస్ యంత్రాల సహయంతో రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోంది. మూడు నెలలకు వేరువేరుగా లబ్ధిదారుడు బయోమెట్రిక్ తో వేలిముద్ర ఒకేసారి వేయాల్సి ఉంటుంది.
ఇలా వేసే సమయంలో ఈ పాస్ యంత్రం, స్లిప్ ప్రింటింగ్ తో రేషన్ ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గతంలో కరోనా సమయంలో ఈ పాస్ యంత్రాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అలా ఇస్తే తప్పా మూడు నెలల రేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అధికారులు నిబంధనలను సడలిస్తారా, లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు.
రేషన్ డీలర్లకు ఇబ్బంది కలగకుండా చూడాలి
మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. జూన్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ చేసే అవకాశం కల్పించాలి. రేషన్ బియ్యంను ఒకేసారి కాకుండా విడతల వారీగా రేషన్ షాపులకు పంపించాలి. ఈ పాస్ యంత్రాలతో ఒక్కో కుటుంబానికి మూడు నెలల రేషన్ వివరాలను వేరు వేరుగా నమోదు చేయాలంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా టైంలో ఈ పాస్ యంత్రాలకు మినహయింపు ఇస్తూ , మ్యానువల్‌గా వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు కూడా అలా చాన్స్ ఇవ్వాలి.
పంజాల రంగయ్య , గుర్తూరు, రేషన్ డీలర్ల సంఘం జిల్లా నాయకుడు