
ఏటూరునాగారం, వెలుగు: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె.శశాంక సూచించారు. సోమవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఏటూరునాగారం మండలంలోని దొడ్ల, కొండాయి గ్రామాల మధ్య జంపన్న వాగు బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఐటీడీఏలో పీవో చిత్ర మిశ్రా, ఎస్పీ శబరీశ్, అడిషనల్ కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో గోదావరి, జంపన్న వాగు ప్రవాహ ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున, ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించేలా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహా, ఆయా శాఖలు సన్నద్ధమై ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. వరదలు ప్రవహించే ప్రాంతాల మీదుగా ప్రజలు రాకపోకలకు నిషేధం విధించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పురాతన, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే హెల్త్క్యాంపులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అనంతరం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్థానికులను తరలించేలా పునరావాస కేంద్రాలను ఏర్పాట్లు చేశామని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. వరకు జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే పీవో వివరించారు. అనంతరం రామన్నగూడెంలోని గోదావరి పుష్కర ఘాట్వద్ద వరద ఉధృతిని శశాంక పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, ఐటీడీఏ ఏపీవో వసంత రావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.