వరదలోనే వరంగల్.. నీట మునిగిన 150 కాలనీలు

వరదలోనే వరంగల్..  నీట మునిగిన 150 కాలనీలు
  • వరదలోనే వరంగల్..  నీట మునిగిన 150 కాలనీలు  
  • మూడేళ్ల కిందటి కంటే ఈసారి ఎఫెక్ట్ ఎక్కువ
  • సాయం కోసం జనం ఎదురుచూపులు
  • 24 గంటలుగా కరెంట్​ లేక అవస్థలు 

వరంగల్‍/హనుమకొండ, వెలుగు:  రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో గ్రేటర్ వరంగల్​ను వరద చుట్టుముట్టింది. హనుమకొండ పూర్తిగా జలదిగ్బంధమైంది. సోమవారం నుంచి కురుస్తున్న వానలతో వరంగల్‍ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కాలనీలు నీటమునిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు నాలుగు గంటలపాటు దంచికొట్టిన వర్షానికి హనుమకొండలోని కాలనీలు అతలకుతలమయ్యాయి. గ్రేటర్ కార్పొరేషన్​పరిధిలో 183 లోతట్టు కాలనీలు ఉండగా.. 150 నుంచి 160 కాలనీల్లోని ఇండ్లలోకి మోకాలు లోతున వరద చేరింది. బుధవారం సాయంత్రం వరకు వరంగల్​లో 80 శాతం, హనుమకొండలో 20 శాతం వరద ఎఫెక్ట్​ఉండగా, గురువారం ఉదయానికి హనుమకొండ పూర్తిగా నీటమునిగింది. ఇండ్లలోకి నీరు చేరడంతో జనం అల్లాడుతున్నారు. బుధవారం సాయంత్రం కరెంట్​సప్లైను బంద్​చేసిన అధికారులు గురువారం రాత్రికి కూడా అందించలేకపోయారు.

గంట గంటకూ పెరిగిన ప్రవాహం.. 

ALSO READ :మోరంచపల్లిలో విధ్వంసాన్ని మిగిల్చిన వరదలు

2016, 2020లో వరదల టైంలో ముంపు ప్రభావం లేని కాలనీలు కూడా ఈసారి నీటమునిగాయి. అసంపూర్తి పనులే ఇందుకు కారణం. హనుమకొండలోని నయీం నగర్​ నాలా మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. వడ్డేపల్లి, గోపాల్‍పూర్​చెరువుల్లోని వరద పోటెత్తడంతో 40 నుంచి 50 కాలనీలు ఆగమయ్యాయి. గురువారం గంటగంటకు ప్రవాహం పెరగడంతో జనం కేయూసీ రోడ్డులోని పెగడపల్లి డబ్బాల వద్ద మెయిన్‍రోడ్​దాటలేకపోయారు. గోపాల్‍పూర్‍, అమరావతి నగర్‍, టీవీ టవర్‍కాలనీ, సరస్వతి నగర్‍, శ్రీనివాసనగర్‍, ఇంజినీర్స్​కాలనీ, సమ్మయ్య నగర్‍, విద్యా నగర్‍, అంబేద్కర్​భవన్‍, రాజాజీనగర్‍, రంగుబార్​లేన్‍, నందితారే నగర్‍, రాంనగర్‍, వాగ్దేవి కాలేజీ, నయీంనగర్‍, కిషన్‍పుర, ఈద్గా, పోచమ్మకుంట శ్మశానవాటిక రోడ్‍, హనుమాన్‍నగర్‍లోని నాలుగు కాలనీలు, పెగడపల్లి డబ్బాలు ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. వరంగల్​ తూర్పు పరిధిలోని ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ప్రయాణికులను సిటీ దాటనివ్వలేదు. ఇండ్ల నుంచి బయటికి రాలేక ముంపు బాధితులు సాయం కోసం తెలిసిన వారికి కాల్​చేసి వేడుకుంటున్నారు.