
- మనిషికి రూ.400 ఇచ్చి సభకు తీసుకొస్తున్నరని ఆరోపణ
పరకాల, వెలుగు : “ రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి వరంగల్ఎల్కతుర్తిలో సభ పెడుతున్నవ్..? ఆ పైసలన్నీ ఎక్కడివి..? పదేండ్లలో ప్రజలను దోచుకున్నవి కాదా?.. నీ తాత సంపాదించిన భూమి అమ్మి పెట్టిన పైసలా? అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శలు చేసే ముందు బీఆర్ఎస్లోని 36 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మళ్లీ గెలిస్తే తను రాజీనామా చేసి రాజకీయాల్లోకి రాకుండా సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్‌చేశారు.
శనివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ప్రెస్‌మీట్ లో మాట్లాడారు. అధికారం కోల్పోయిన17 నెలల్లోనే10 లక్షల మందిని సభకు తెస్తామంటూ.. మనిషికి రూ.400 ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో ఉంటూ ఇప్పుడు జనాల్లోకి రావడానికి సిగ్గుండాలని ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ ది అబద్ధాలతో కూడిన చరిత్ర అని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన రోజు కూడా పోలేదని గుర్తు చేశారు. సోనియమ్మ కాళ్లు మొక్కి టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తనని మాట మార్చి అధికారంలోకి వచ్చి మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ తన స్వార్థంతో అప్పుల పాలు చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. టౌన్ప్రెసిడెంట్ కొయ్యడ శ్రీనివాస్, కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ఏఎంసీ చైర్మన్ రాజిరెడ్డి ఉన్నారు.