
- రూ. 32 లక్షల విలువైన ఎలక్ట్రికల్ పరికరాల పట్టివేత
- ఆరుగురిని అరెస్ట్ చేసిన వరంగల్ సిటీ పోలీసులు
హనుమకొండసిటీ, వెలుగు : నకిలీ ఎలక్ర్టికల్ సామగ్రి అమ్ముతున్న ఆరుగురిని వరంగల్ సిటీ పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్స్, మట్టెవాడ, కేయూసీ, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం సిటీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. హనుమకొండలోని పెగడపల్లి డబ్బాలకు చెందిన పొనమారం చౌదరి(30), కాంతిలాల్ (34), వరంగల్ రామన్నపేట్ కు చెందిన రాజ్ పురోహిత్ బీర్ సింగ్ (60), పురోహిత్ శ్రవణ్ కుమార్(28), హైదరాబాద్ కు చెందిన పురోహిత్ భరత్ కుమార్ (35),అమృత్ జైన్ (42)ను అదుపులోకి తీసుకున్నారు.
పాలీకాబ్, వి గార్డ్, గోల్డ్ మోడల్, ఫినోలెక్స్, చార్ భుజా, యాంఖర్, లీగ్రాండ్ బ్రాండ్ల పేరిట నకిలీ గృహోపకరణాలను అమ్ముతున్నట్టు తేలింది. నిందితులను అరెస్ట్ చేసి రూ. 32 లక్షల విలువైన సామగ్రితో పాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, వరంగల్ ఏఎస్పీ శుభం, టాస్క్ఫోర్స్ మధుసూదన్, హనుమకొండ ఏసీపీ నర్సింహరావు, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ సార్ల రాజు, కేయూ, మట్టెవాడ, హనుమకొండ ఇన్ స్పెక్టర్లు రవికుమార్, గోపి, శివకుమార్ ఉన్నారు.