ఓరుగల్లులో బోగస్‍ వెహికల్‍ రిజిస్ట్రేషన్లు..నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు

ఓరుగల్లులో బోగస్‍ వెహికల్‍ రిజిస్ట్రేషన్లు..నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు
  • వాహన కన్సల్టెన్సీలతో కలిసి ఆర్టీఏ బ్రోకర్ల దందా
  • రెండు ఘటనల్లో 15 మందిని అరెస్ట్ చేసిన వరంగల్‍ పోలీసులు

వరంగల్‍, వెలుగు: ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసేలా బోగస్‍ వెహికల్‍ రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్  సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఆర్టీఏ బ్రోకర్లు, వాటితో వాహనాలు అమ్ముతున్న కన్సల్టెన్సీలను వరంగల్‍ పోలీసులు అరెస్ట్  చేశారు. వరంగల్‍ సెంట్రల్‍ డీసీపీ షేక్‍ సలీమా తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ పరిసర ప్రాంతాలకు చెందిన ఎండీ ఆసిఫ్ ఖురేషీ, వడ్లకొండ శ్రీనివాస్‍, ఎండీ నవాబ్‍, ఎండీ సాబీర్‍, మణికంటి ప్రభాకర్‍రెడ్డి, గుగ్గిళ్ల చెర్రిబాబు, కేశోజు రాజ్‍కుమార్‍, ఎండీ ఆసిఫ్‍, అంకం శ్రీనివాస్‍, ధర్మసాగర్‍, గోనెల రమేశ్‍, ఎన్‍ శశివర్ధన్‍, నరిశెట్టి రాజేశ్‍, తండ దిలీప్‍ కుమార్‍, ముజ్జిగ ఓంప్రకాశ్‍, ముషిపట్ల అక్షయ్‍ కుమార్‍ ఆర్టీవో బ్రోకర్లుగా, వాహన కన్సల్టెన్సీలుగా పని చేస్తున్నారు. 

వీరిలో ఆసిఫ్‍ ఖురేషీ, వడ్లకొండ శ్రీనివాస్‍ ఆర్టీఏ ప్రధాన ఏజెంట్లు. ఈఎంఐలు కట్టని వాహనాలను జప్తు చేసిన సంస్థలు వాటిని ఇతరులకు అమ్మేందుకు ఆర్టీఏ ఆఫీస్‍లో ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు వాహన కన్సల్టెన్సీలకు ఎన్‍వోసీల ఆధారంగా రిజిస్ట్రేషన్‍ లేకుండా వెహికల్స్​ అమ్ముతున్నారు. ఆ తర్వాత కన్సల్టెన్సీలు వాటిని అమ్మేందుకు ఆర్‍టీఏ ఏజెంట్లను సంప్రదించి బోగస్‍ రిజిస్ట్రేషన్‍ పత్రాలు తయారు చేసే వారితో చేతులు కలిపారు. 

వీరంతా కలిసి వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‍లైన్‍లో సేకరించి ఒరిజినల్‍ కార్డులపై థర్మల్‍ ప్రింటింగ్‍ మెషీన్‍ ద్వారా ఒరిజినల్‍ తరహాలో తయారు చేసి వాహనాలు అమ్ముతున్నారు. మరో ఘటనలో కేయూసీ, మిల్స్ కాలనీ పోలీస్‍ స్టేషన్ల పరిధిలోని ఆర్టీఏ బ్రోకర్లు..ఫేక్‍ ఇన్సూరెన్స్  సర్టిఫికెట్లను తయారు చేసి, వాటి ద్వారా ఆర్టీఏ ఆఫీస్‍లో అవసరమైన ఫిట్‍నెస్‍ రెన్యూవల్‍ సర్టిఫికెట్లు పొందుతున్నారు. అక్రమాలను గుర్తించిన టాస్క్​ఫోర్స్, ఆర్టీఏ, పోలీసులు 15 మందిని అరెస్ట్​ చేసి, వారి నుంచి 6 కంప్యూటర్లు, 2 ల్యాప్‍టాప్ లు, 2 థర్మల్‍ ప్రింటర్స్, 17 సెల్‍ఫోన్లు, ప్రింటింగ్‍ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ కేసుల్లో నిందితులైన లక్ష్మమ్మ, సతీశ్, వేల్పుల ప్రశాంత్‍, దేవులపల్లి శ్రావణ్‍, మామిడి రాజు పరారీలో ఉన్నారు. ఈ రెండు కేసుల్లో ఆర్టీఏ ఉద్యోగుల హస్తం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన వరంగల్‍ ఏసీపీ శుభం ప్రకాశ్‍, హనుమకొండ, టాస్క్​ఫోర్స్​ ఏసీపీలు నర్సింహారావు, మధుసూదన్, ఇన్స్​పెక్టర్లు సత్యనారాయణరెడ్డి, శ్రీధర్‍, బాబులాల్‍, పవన్‍ కుమార్‍  ను ఆమె అభినందించారు.