
వరంగల్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‍ప్రీత్‍సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వరంగల్ కమిషనరేట్లో వరంగల్, హనుమకొండ, జనగామ కలెక్టర్లు సత్యశారద, స్నేహశబరీశ్, రిజ్వాన్ బాషా షేక్‍తో కలిసి వివిధ శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలో లోకల్ బాడీ ఎలక్షన్లు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు ఉండాలన్నారు. సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలు గుర్తించడమే కాకుండా గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమస్యలకు చెక్ పెట్టాలన్నారు.
రూట్లు, జోన్లవారీగా మ్యాప్‍లు సిద్ధం చేసి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్‍ఎస్టీ బృందాలతో మనీ, మద్యం తరలింపును కట్టడి చేయాలన్నారు. కలెక్టర్లు మాట్లాడుతూ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మొదలు చేపట్టే చర్యల విషయంలో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, అడిషనల్ కలెక్టర్లు సంధ్యారాణి, వెంకట్‍రెడ్డి, జడ్పీ సీఈవోలు రామ్‍రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.