తొమ్మిదేండ్ల కింద చనిపోయిన వ్యక్తిపై  కేసు..వరంగల్‍ మిల్స్ కాలనీ పోలీసుల నిర్వాకం

తొమ్మిదేండ్ల కింద చనిపోయిన వ్యక్తిపై  కేసు..వరంగల్‍ మిల్స్ కాలనీ పోలీసుల నిర్వాకం
  • సోషల్ మీడియాలో వైరల్   

వరంగల్‍, వెలుగు: తొమ్మిందేండ్ల కింద చనిపోయిన వ్యక్తిపై గ్రేటర్ వరంగల్ పరిధి మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. 2002లో వరంగల్‍ ఉర్సు గుట్ట శివారులోని పలు సర్వే నంబర్లలో  చెన్నమనేని జయశ్రీ అనే మహిళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భార్య ఉషారాణి, జక్కా మహబూబ్‍రెడ్డితో కలిసి 23 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. కొన్ని రోజుల తర్వాత అందులోని 1 ఎకరం 8 కుంటలపై బీమగాని విజయ అనే మహిళతో వివాదం తలెత్తి కోర్టుదాకా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 17న జయశ్రీ స్థానిక మిల్స్ కాలనీ పీఎస్ లో ఐదుగురు వ్యక్తులపై కంప్లయింట్ చేసింది.

బత్తిని చంద్రశేఖర్‍, బత్తిని సంపత్‍, బొమ్మగాని శ్రీను, వేణు, పాలకుర్తి నాగరాజు తమ భూమిలోని వెంచర్‍ వద్దకు వచ్చి తనను చంపుతానని బెదిరించారని..దాడి చేసేందుకు యత్నించారని పిటిషన్ లో ఆరోపించింది. కాగా మిల్స్ కాలనీ పోలీసులు ఎంక్వరీ చేయకుండానే అదే నెల 21న కేసు ఫైల్ చేసింది. 

అయితే.. 2016 సెప్టెంబర్‍ 17న చనిపోయిన బత్తిని చంద్రశేఖర్‍ పేరును ఏ1గా.. మిగతావారిని ఏ2, ఏ3, ఏ4, ఏ5గా కేసులో చూపారు. దీంతో చనిపోయిన వ్యక్తి పై కేసు నమోదు చేయడంపై పోలీసుల నిర్వాకంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వరంగల్‍ పరిధిలో కొందరు లీడర్ల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  తాజాగా మిల్స్ కాలనీ పీఎస్ పోలీసుల తీరు కాస్త సోషల్‍ మీడియాలోనూ వైరల్‍ గా మారింది.