వరంగల్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్న పని ఇదా..?

వరంగల్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్న పని ఇదా..?
  • ఆరోగ్యశ్రీ ట్రీట్‍మెంట్‍ కావాలా?
  • బిల్లులో 50 శాతం కట్టాల్సిందే..
  • ఆరోగ్యశ్రీలో లేదంటూ తప్పుదోవ పట్టిస్తున్న వైనం
  • దవాఖానల్లో అదనపు వసూళ్లు
  • మేనేజ్‍మెంట్లకు ఆరోగ్య మిత్రల సహకారం 
  • విధి లేక ప్రైవేటుకు..

వరంగల్‍, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేద పేషెంట్ల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని వరంగల్లోని పలు ప్రైవేట్‍ హాస్పిటల్స్​తప్పుదారి పట్టిస్తున్నాయి. కాలు విరిగిందని..కిడ్నీలో రాళ్లతో నొప్పి ఉందని.. గుండెనొప్పి వస్తోందని ఎమర్జెన్సీ సేవల కోసం వస్తున్న పేద రోగులకు సకాలంలో సేవలు అందించాల్సి ఉండగా డాక్టర్లు బిజినెస్‍ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ స్కీం జాబితాలో వారికి సంబంధించిన ట్రీట్‍మెంట్‍ లేదని కొందరు చెబుతుంటే, ఒకవేళ ఉన్నా..ఆ పథకంలో సరైన వైద్యం అందదని చెప్పి పేషెంట్ల కుటుంబాలను భయపెడుతున్నారు.

ఇంకొందరు ఆరోగ్యశ్రీ బిల్లులు రావట్లేదని..ప్రైవేట్‍లో చికిత్స చేస్కోవాలని లేటైతే ప్రాణానికే ప్రమాదమంటూ వచ్చిన రోగులను బతికుండాగానే మానసికంగా చంపేస్తున్నారు. మొత్తం బిల్లులో 50 శాతం నగదు కడితేనే మిగతా డబ్బులను ఆరోగ్యశ్రీలో క్లెయిమ్‍ చేసుకుంటామని ఆఫర్‍ ఇస్తున్నారు. క్యాష్‍ కట్టాకే ట్రీట్‍మెంట్‍ మొదలుపెడ్తున్నారు. కట్టిన డబ్బులకు బిల్లులు, రిసిప్టులు ఉండవని ముందే చెబుతున్నారు. కాగా, ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీ పేషెంట్ల మేలు కోరాల్సిన కొందరు ఆరోగ్యమిత్రలు హాస్పిటల్‍ మేనేజ్‍మెంట్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఎమర్జెన్సీ టైంలో..ప్రాణాలతో బిజినెస్‍
గ్రేటర్‍ వరంగల్​లో ఎంజీఎం హాస్పిటల్​తో పాటు కాకతీయ మెడికల్‍ కాలేజీ ఆవరణలో అత్యధునిక సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ ఉంది. ఈ రెండింటింలో ఆరోగ్యశ్రీ అమలవుతోంది. అయినప్పటికీ సిటీలో గల్లీకి రెండు కార్పొరేట్‍ హాస్పిటల్స్​నడుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్‍, జర్నలిస్టు కార్డులకు సేవల పేరుతో మొదట ఆకర్షిస్తున్న కార్పొరేట్‍ హాస్పిటల్స్​తీరా పేషెంట్‍ఎమర్జెన్సీని అడ్డుపెట్టుకుని బ్లాక్‍ మెయిల్‍ చేస్తున్నాయి. 

అప్పటివరకు ఆరోగ్యశ్రీ ఉందని చెప్పి..చివర్లో సగం బిల్లు కట్టాల్సిందేనని కండీషన్‍ పెడ్తున్నారు. దీంతో అప్పటికప్పుడు ఏంచేయాలో తెలియక అప్పుతెచ్చిమరీ డాక్టర్ల చేతుల్లో పోస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు నిర్వహించే క్రమంలో అవసరాన్ని బట్టి ముందు ఉచితంగా చేయాల్సిన 2డీ ఈకో, ఆంజియోగ్రామ్​తో పాటు వేలాది రూపాయల ఖర్చు ఉండే పరీక్షల డబ్బులను పేషెంట్లతోనే పెట్టిస్తున్నారు. ఎముకలు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాల్లో వరంగల్‍ సిటీలో ‘ఆరోగ్యశ్రీ ఎంపానల్‍’ లిస్టులో ఉన్న ప్రముఖ హాస్పిటల్స్​లో ఈ దందా సాగుతోంది.

సాయంత్రం 5 దాటితే..ఆరోగ్యశ్రీ బంద్‍
గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలోని ఆరోగ్యశ్రీ ఎంపానల్​జాబితాలో ఉన్న పలు ప్రైవేట్‍ హాస్పిటల్స్​లో పేషెంట్లకు 24 గంటల వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే, సాయంత్రం 5 గంటలు దాటితే ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తరఫున పేషెంట్లకు సేవలందించాల్సిన మెడికో కో ఆర్డినేటర్లు ఉండడం లేదు. ఆదివారం, పండుగలు రోజుల్లోనూ ఇలానే ఉంటోంది. తీరా ఏదైనా ప్రమాదం జరిగి..ఆరోగ్యశ్రీ సేవలు ఉంటాయని వచ్చినవారిని ఆరోగ్య మిత్రలు లేకపోవడంతో ప్రైవేట్‍ పేషెంట్‍ కింద చేర్చుకుని దండుకుంటున్నారు. 

బాధితులు వైద్యం కోసం వచ్చే క్రమంలో ట్రీట్‍మెంట్‍ స్కీంలో వర్తిస్తుందో లేదో చెప్పాల్సి ఉండగా..నిర్ణయం డాక్టర్‍కు వదిలేస్తున్నారు. తీరా వారు పేషెంట్ల అవసరంతో బిజినెస్‍ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఎంపానల్​లిస్టులో ప్రైవేట్‍ హస్పిటల్స్​పేరున్నా..ఏయే రోగాలకు ఆరోగ్యశ్రీ కింద పర్మిషన్‍ ఉందో తెలిపే బోర్డులు పెట్టడం లేదు. ఈ విషయం తెలియక ఎమర్జెన్సీ టైంలో వచ్చినవారు ఆరోగ్యశ్రీ లేదని తెలిసినా..టైం వృథా అయితే ఏమవుతుందోనని ప్రైవేట్ కేసు కింద అడ్మిట్‍ అవుతున్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద కొత్త హాస్పిటల్స్​ పేర్లు చేర్చింది తప్పితే.. కొత్తగా ఆరోగ్యమిత్రలను రిక్రూట్‍ చేయకపోవడం సమస్యగా మారింది. దీంతో ఒక్కో మిత్రతో రెండుమూడు హాస్పిటల్స్​లో విధులు నిర్వహించాల్సి వస్తోంది. 

కమీషన్‍ కోసం ప్రైవేట్‍ హాస్పిటళ్లకు.. 
ఆరోగ్యశ్రీ సేవలు ఎంజీఎం హాస్పిటల్‍తో పాటు కేఎంసీలోని సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కీలకమైన న్యూరో, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, కిడ్నీ ఆపరేషన్ల చేస్తారు. అవసరమైన టెస్టులు చేసే పరికరాలు కూడా ఉన్నాయి. దీంతో టెస్టుల డబ్బులు మిగులుతాయని పలువురు పేషెంట్లు సర్కారు హాస్పిటల్స్​లో చేరుతున్నా ఇక్కడి కొందరు డాక్టర్లు తాము బయట పనిచేసే ప్రైవేట్‍ హాస్పిటల్‍ కు వెళ్లాలని..ఆరోగ్యశ్రీ కిందనే సేవలు ఉంటాయని డైవర్ట్​ చేస్తున్నారు. అదే డాక్టర్లు పేషెంట్లకు ఎంజీఎంలో ఆపరేషన్‍ చేస్తే ఆరోగ్యశ్రీ ట్రస్ట్​ ద్వారా వచ్చే అమౌంట్​లో 40 నుంచి 50 శాతం డాక్టర్లు బృందానికి ఇవ్వాల్సి ఉండగా..మిగతా 50 శాతం హాస్పిటల్​డెవలప్‍మెంట్‍కు వెళతాయి. కాగా, ఇక్కడికి వచ్చిన పేషెంట్లను తమ ప్రైవేట్‍ హాస్పిటల్‍లో ట్రీట్​మెంట్​ఇచ్చి ఆరోగ్యశ్రీ నుంచి 100 శాతం కమీషన్‍ నొక్కేస్తున్నారు.

చెడ్డపేరు తెస్తున్రు
కాంగ్రెస్‍ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పథకంలో 1,672 ప్రొసీజర్లు ఉండగా, 1,375 ప్రొసీజర్ల ధరలను 20 నుంచి 25 శాతం పెంచారు. చివరిసారిగా 2013లో ఛార్జీలను పెంచగా..11 ఏండ్ల తర్వాత రేవంత్‍రెడ్డి ప్రభుత్వం మరోసారి పెంచింది.  దీనికితోడు స్కీంలో మరో 163 కొత్త ప్రొసీజన్లను చేర్చింది. ఆరోగ్యశ్రీ లిమిట్‍ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఆపరేషన్​ సమయంలో ఇచ్చే ఎక్విప్‍మెంట్‍లో క్వాలిటీ పెంచింది. ఇంత చేసినా ప్రైవేట్‍, సూపర్‍ హాస్పిటల్స్​ మాత్రం పేషెంట్ల వద్ద డబ్బులు దోచుకుంటున్నారు.

వరంగల్​కు చెందిన ఓ మహిళకు కిడ్నీ నొప్పి ఉండగా..ఆరోగ్యశ్రీలో ట్రీట్‍మెంట్‍ ఉందంటే హనుమకొండ అశోక్‍ టాకీస్‍ గల్లీలో ఉండే హస్పిటల్‍ కు వెళ్లింది. మొదట ఆరోగ్యశ్రీలో చేస్తామని చెప్పి ఉచితంగా చేయాల్సిన టెస్టులకు డబ్బులు కట్టించుకున్నారు. ఆపై చికిత్స మొదలుపెట్టే క్రమంలో రాళ్లు తీసేసే ప్రక్రియ ఆరోగ్యశ్రీలో లేదని అబద్దం చెప్పారు. మొత్తం అమౌంట్‍లో దాదాపు రూ.30 వేలు సొంతంగా కడితే మిగతావి ఆరోగ్యశ్రీలో క్లెయిమ్‍ చేస్కుంటామని, నష్టం తమకేనని బిల్డప్​ఇచ్చారు. దీంతో చేసేదేమిలేక వారు చెప్పినట్లే చేశారు. ఇక్కడికి వచ్చే ప్రతి 10 ఆరోగ్యశ్రీ కేసుల్లో ఎక్కువగా ఇలాగే చేస్తున్నట్టు తెలిసింది

గీసుగొండ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు వరంగల్‍ నుంచి నర్సంపేట వెళ్లే క్రమంలో వెంకట్రామ థియేటర్‍ దగ్గరలో ఉండే ఓ హాస్పిటల్‍కు కొన్ని రోజుల క్రితం కడుపు నొప్పితో వెళ్లాడు. డాక్టర్లు పాంక్రియాసిస్​అనిచెప్పి ఆరోగ్యశ్రీలో ఉందని టెస్టుల కోసం రూ.15 వేలు కట్టించుకున్నారు. సాయంత్రం ఆపరేషన్‍ చేసే టైంలో రూ.1.50 లక్షలు డిమాండ్‍ చేశారు. అదేంటని ప్రశ్నిస్తే.. ఆక్యూర్డ్ పాంక్రియాసిస్​అని డబ్బులు కడితేనే చేస్తామన్నారు. స్థోమత లేని ఆ పేషెంట్‍ అప్పటికప్పుడు మరో ప్రైవేట్‍ హాస్పిటల్‍ వెళితే అక్కడ మాత్రం ఉచితంగా చేశారు.