
- గతంలో హైదరాబాద్ తర్వాత ఇక్కడే ప్రమోషన్లు, ఈవెంట్లు, సక్సెస్ మీట్స్ నిర్వహించేవారు
- కొంతకాలంగా ప్రోత్సాహంలేక తగ్గిపోయిన షూటింగ్ లు
- ప్రపంచ సుందరీమణుల రాకతో అంతర్జాతీయంగా గుర్తింపు
- ఈ ప్రాంతానికి చెందిన డైరెక్టర్లు, లీడర్లు ప్రోత్సహించాలంటున్న జిల్లా ప్రజలు
వరంగల్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలకు నెలవు. సినిమా షూటింగ్ ల లొకేషన్లకు కొదువలేదు. పురాతన కట్టడాలు, కోటలు, ఆలయాలు, సరస్సులతో ఆకట్టుకుంటుంది. ఇక్కడ 20 ఏండ్ల కిందటే స్టార్ హీరోల సినిమాల షూటింగ్ లు జరిగేవి. సినిమా ప్రమోషన్లు, సక్సెస్ మీట్లు నిర్వహించేవారు.
జిల్లాలోని ప్రకృతి అందాలు, లొకేషన్లు టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. 800 ఏండ్ల కిందటి కాకతీయుల వరంగల్‍కోట, వెయ్యిస్తంభాల గుడి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, పాకాల సరస్సు, లక్నవరం సరస్సులోని రోప్‍వేలు, రిసార్టులు ఊటీని తలపిస్తాయి. బొగతా, భీమునిపాదం, ముత్యాలధార వాటర్ ఫాల్స్, పాండవులు గుట్టలు, ఏటూరు నాగారం, పాకాల అభయారణ్యాలు, దొరల ఘడీలు, సిటీలో భద్రకాళి బండ్, కాకతీయ జూపార్క్ నేచురల్ లొకేషన్లుగా ఉన్నా.. కొన్నాళ్లుగా జిల్లాలో సినిమా షూటింగ్లు మాత్రం తగ్గిపోయాయి.
ఆర్టిస్టులున్నా.. ప్రోత్సాహం నిల్
ఓరుగల్లు నుంచి మెగా ఫోన్ పట్టి డైరెక్టర్లు అయి బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టారు. ఇండస్ట్రీని, సినిమాను మెప్పించడంలో, ఒప్పించడంలో జిల్లాకు చెందిన డైరెక్టర్లు, రైటర్లు మరింత ఫోకస్ పెట్టాల్సి ఉంది. కొంతకాలంగా ఇక్కడి లొకేషన్లలో షూటింగ్ లు అంతగా జరగడంలేదు. ఈ ప్రాంతానికి చెందిన దర్శకులకు అవకాశం ఉన్నా.. వారు చొరవ తీసుకోవడంలేదు.
జిల్లా నుంచి ప్రభుత్వం తరఫున కావాల్సిన ప్రోత్సాహం అందించాల్సిన లీడర్లు తమ పని కాదన్నట్లుగా చూస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా వివిధ దేశాలకు చెందిన ప్రపంచ సుందరీమణులు, ఇంటర్నేషనల్ మీడియా సందర్శనకు జిల్లాకు రావడంతో ఓరుగల్లు అందాలు మరోసారి అంతర్జాతీయంగా ఆకర్షిస్తున్నాయి.
లోకల్ యువతకు ఉపాధికి అవకాశాలు
ఓరుగల్లులో సినిమా షూటింగ్ లు పెరిగితే స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే చాన్స్ ఉంది. గతంలో రెగ్యులర్ షూటింగ్స్ జరిగిన నేపథ్యంలో పర్యాటకుల రద్దీ పెరిగింది. దీంతో బోటింగ్, గైడ్స్, ట్రాన్స్ పోర్ట్, హోటల్, రెస్టారెంట్ వంటి రంగాలు విస్తరించాయి. షూటింగ్ లల్లో జూనియర్ ఆర్టిస్టులుగా స్థానిక యువత అవకాశాలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ అభివృద్ధి చెందుతుందని భావించేలోపే నాలుగైదు ఏండ్లుగా సినిమా షూటింగ్ లు తగ్గాయి. దీంతో స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేక సినిమా ఆర్టిస్టులకు కూడా అవకాశాలు రాకుండా పోయాయి. గతంతో పోలిస్తే వరంగల్ సిటీ, ఇక్కడి పర్యాటక ప్రాంతాలు ప్రస్తుతం మరింత అభివృద్ధి చెందిన క్రమంలో.. తిరిగి సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తే ఓరుగల్లు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.