30 ఏండ్ల తర్వాత.. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మోక్షం.. కేడబ్ల్యూఎఫ్ బృందం పర్యటన

30 ఏండ్ల తర్వాత.. వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మోక్షం..  కేడబ్ల్యూఎఫ్ బృందం పర్యటన
  • 50 శాతం ఆర్థిక సాయానికి సానుకూలం
  • 2005-06లో రూ. 800 కోట్లు వచ్చినట్లే వచ్చి ఆగిన యూజీడీ
  • ఇప్పుడు రూ.5,257 కోట్లతో ఓరుగల్లు చరిత్రలోనే బడా ప్రాజెక్టు

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ నగరంలో 30 ఏండ్లుగా కలగా ఉన్న అండర్  గ్రౌండ్‍ డ్రైనేజీ(యూజీడీ)కి ఎట్టకేలకు మోక్షం కలగనుంది. రేవంత్‍రెడ్డి సర్కార్‍ ఇచ్చిన మాట ప్రకారం రూ.5,257 కోట్లతో వరంగల్‍ అండర్  గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణానికి రూపకల్పన చేయగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25 శాతం నిధులు భరించేందుకు గ్రీన్  సిగ్నల్‍ ఇచ్చాయి. అలాగే జర్మనీ కేఎఫ్‍డబ్ల్యూ ప్రతినిధుల బృందం నాలుగు రోజుల కింద నగరంలో పర్యటించి 50 శాతం ఆర్థికసాయం అందించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. 

దీంతో 20 ఏండ్ల కింద వచ్చినట్లే వచ్చి వెనక్కు వెళ్లిన యూజీడీ ప్రాజెక్ట్  ఈసారి అనుమతులు, నిధుల మంజూరుతో పట్టాలెక్కబోతోంది. రాబోయే రెండున్నరేండ్లలో పనులు పూర్తి చేయాలని రాష్ట్ర సర్కార్‍ నిర్ణయించిన నేపథ్యంలో.. త్వరలోనే ప్రాజెక్ట్​కు సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

2005–06లో అడుగులు..

గ్రేటర్‍  వరంగల్​లో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణం అవసరమని 30 ఏండ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నారు. 2005–06లో యూపీఏ సర్కారు అధికారంలో ఉండగా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న జైపాల్‍రెడ్డి వరంగల్‍ సిటీలో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ ఏర్పాటుకు చొరవ చూపారు. ప్రాజెక్ట్  నిర్మాణానికి రూ.800 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. డీపీఆర్‍ తయారు చేయాలని సూచించినప్పటికీ, వివిధ కారణాలతో పెండింగ్​లో పడింది.

కేఎఫ్‍డబ్ల్యూ సానుకూలం.. 

వరంగల్‍ అండర్​ గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన 50 శాతం నిధులను కేఎఫ్‍డబ్లూ అందించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్  నిర్మాణానికి రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోద ముద్ర వేయగా,  మిగిలిన నిధులు సమకూర్చేందుకు కేఎఫ్​డబ్ల్యూ టీమ్​ సోమ, మంగళవారాల్లో గ్రేటర్ వరంగల్​లో పర్యటించింది. ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి నిర్వహణ వ్యవస్థను పరిశీలించింది. 

వరంగల్‍, హైదరాబాద్‍ మార్గంలోని రాంపూర్‍ డంపింగ్‍ యార్డ్, నగరంలో హనుమకొండ బాలసముద్రం వద్దనున్న బయోమైనింగ్‍ యూనిట్లు, జీడబ్ల్యూఎంసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్‍ను సందర్శించారు. హనుమకొండ రెడ్డిపురం ప్రాంతంలో గతంలో ప్రతిపాదించిన సీవరేజ్‍ ట్రీట్‍మెంట్‍ ప్లాంట్‍(ఎస్‍టీపీ) నిర్మాణ స్థలంతో పాటు నగరంలోని మురుగు నీరు చేరే నాగారం చెరువును పరిశీలించారు. 

బంధం చెరువు వద్ద నిర్వహిస్తున్న మురుగు నీటి శుద్ధీకరణ ప్రక్రియ, నిర్వహణ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరంగల్‍ యూజీడీ ప్రాజెక్ట్​పై జిల్లా అధికారులు, డీపీఆర్‍ వంటి పనులు చూస్తున్న డ్యూ లైట్‍ కన్సల్టెన్సీ టీమ్​తో కేఎఫ్‍డబ్ల్యూ ప్రతినిధులు నోబర్ట్  లూకాస్‍, క్లార్క్, కిరణ్‍ సమావేశమయ్యారు. డీపీఆర్‍, టెండర్‍ ప్రక్రియ, దాని అమలుపై వివరాలు సేకరించారు. యూజీడీ పనుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్  అమలులో సాంకేతికపరమైన సూచనలు చేసి ప్రాజెక్ట్  నిర్వహణకు ఆర్థికసాయం అందించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు.

నిధుల కేటాయింపు ఇలా..

వరంగల్‍ అండర్​ గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో రూ.5,257.20 కోట్ల అంచనాతో నిధులను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. మే 21న రూ.4,674.6 కోట్లతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అనుమతులు మంజూరు చేసింది. అర్బన్‍ చాలెంజ్‍ ఫండ్‍(యూసీఎఫ్‍) కింద రాష్ట్రంలోని ప్రాజెక్టులకు రూ.5,681 కోట్ల పనులకు ఈ శాఖ పరిధిలోని నేషనల్‍ అపెక్స్  కమిటీ ఆమోదం తెలుపుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ సెక్రటరీ హీరాలాల్‍ మిశ్రా నుంచి రాష్ట్ర సర్కారుకు లేఖ అందింది. ఈ నిధుల్లో రూ.4,674.60 కోట్లు వరంగల్‍ యూజీడీ కోసం మంజూరు చేశారు. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25 శాతం వాటాగా రూ.1,168.65 కోట్ల చొప్పున నిధులు అందించేందుకు గ్రీన్  సిగ్నల్‍ ఇచ్చాయి. మిగిలిన రూ.2,337.30 కోట్లు జర్మన్‍ డెవలప్‍మెంట్‍ బ్యాంక్‍ కేఎఫ్‍డబ్ల్యూ రుణంగా ఇవ్వనుంది.

రెండున్నరేండ్లలో పూర్తి చేసేలా..

రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‍ యూజీడీ పనులను రెండున్నరేండ్లలో పూర్తి చేయాలని టార్గెట్‍గా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టును 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్​ జోన్ల వారీగా పనులు పూర్తి చేయనున్నారు. 2057 నాటికి జనాభా 22,15,480 మందికి పెరిగే అంచనాతో 2,739 కిలోమీటర్ల అండర్​ గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.