
కాగజ్ నగర్, వెలుగు: ఆదివాసీ గిరిజన సమాజం జోలికోస్తే చూస్తూ ఊరుకోబోమని తాటతీస్తామని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నక్ విజయ్ హెచ్చరించారు. చింతలమానే పల్లి మండలం డబ్బా గ్రామంలో అధికార పార్టీ సర్పంచ్ కొడుకు రషీద్ ఆదివాసీ గిరిజన మహిళ ను లైంగికంగా వేధించిన ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు. ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ సిడం గణపతి, తుడం దెబ్బ సిర్పూర్ తాలూక అధ్యక్షుడు గేడం నగేశ్‌తో కలిసి బుధవారం డబ్బా గ్రామాన్ని సందర్శించారు. సీఐ, ఎస్ఐలు రషీద్ తో పాటు బాధిత మహిళను పొలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇప్పటివరకు బాధితురాలు అచూకీ తెలియడం లేదని ఆరోపించారు. నిందితుడికి పోలీసులు మద్దతిస్తున్నారని దీన్ని ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీ యువకులను ఎంపీపీ బెదిరిస్తున్నారన్నారు. ఆదివాసులకు ఏదైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, కొలవర్ అధ్యక్షుడు బుర్రి నీలయ్య, ఆదిలాబాద్ విద్యార్థి సంఘం నాయకులు, డబ్బా ఆదివాసీ నాయకులు కుంరం నారాయణ పాల్గొన్నారు.