క్రికెట్ మానేసి ఆటో నడుపుకోమన్నరు

క్రికెట్ మానేసి ఆటో నడుపుకోమన్నరు

న్యూఢిల్లీ:  తనను క్రికెట్ మానేసి ఆటో నడుపుకోమని కొందరు కామెంట్లు చేశారని టీమిండియా పేసర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గుర్తుచేసుకున్నాడు. 2019 ఐపీఎల్‌‌లో బాగా ఆడకపోవడంతో ఇలాంటి కామెంట్లు ఎదురయ్యాయని చెప్పాడు. ఆ సీజన్‌‌ తర్వాత తన కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నట్లు తెలిపాడు. అయితే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పిన మాటలు తనను కాపాడాయని పేర్కొన్నాడు. 2019 ఐపీఎల్‌‌ సిరాజ్‌‌కు ఓ పీడకల. ఆ సీజన్‌‌లో 9  మ్యాచ్ ల్లో 7 వికెట్లే తీశాడు. కేకేఆర్‌‌తో జరిగిన  ఓ మ్యాచ్‌‌లో అయితే  అయితే 2.2 ఓవర్లలోనే ఐదు సిక్సర్లు సహా 36 రన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రెండు బీమర్లు వేయడంతో కెప్టెన్ కోహ్లీ అతడిని బౌలింగ్ నుంచి తప్పించాడు. ‘ఆ రెండు బీమర్లు వేసిన తర్వాత అందరూ నన్ను క్రికెట్ మానేసి మా నాన్నతో కలిసి ఆటో నడుపుకోమని కామెంట్స్ చేశారు. అలాంటి కామెంట్లు చాలా వచ్చాయి. కానీ ఆ స్థాయికి రావడానికి నేనెంత కష్టపడ్డానో వారికి తెలియదు. నేను ఫస్ట్  టైమ్ టీమిండియాకు సెలెక్ట్ అయినపుడు ధోనీ భాయ్ నాకో మాట చెప్పాడు. నా ఆట గురించి ఎవ్వరు కామెంట్స్ చేసినా పట్టించుకోవద్దన్నాడు. నువ్వు ఈ రోజు గొప్పగా ఆడితే ప్రశంసిస్తారు.. ఆడకపోతే విమర్శలు చేస్తారు వాటిని పట్టించుకోవద్దన్నాడు. అతడు చెప్పినట్లుగానే అప్పుడు నన్ను కామెంట్​ చేసిన వారే ఇప్పుడు సిరాజ్ భాయ్ నువ్వో గొప్ప బౌలర్‌‌వి అంటూ  ప్రశంసిస్తున్నారు. అందుకే నాకు ఎవ్వరి అభిప్రాయంతో పని లేదు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నా’ అని సిరాజ్ స్పష్టం చేశాడు.