హెడ్ రెగ్యులేటర్​లేక  సర్జ్​పూల్ పై పెరుగుతున్న ఒత్తిడి

హెడ్ రెగ్యులేటర్​లేక  సర్జ్​పూల్ పై పెరుగుతున్న ఒత్తిడి

నాగర్​కర్నూల్, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్​ నీటిమట్టం 884 అడుగులకు చేరడంతో కల్వకుర్తి లిఫ్ట్​ స్కీంలో మొదటిదైన ఎల్లూర్ ​పంప్​హౌజ్​ ​డేంజర్​లో పడింది. కృష్ణానదిలో వరద ఉధృతి కారణంగా ఎల్లూరు పంప్​హౌజ్​ సర్జ్​పూల్​పై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. నది నుంచి సర్జ్​పూల్​కు నీరు వచ్చే అప్రోచ్​ కెనాల్​ ముందుభాగాన ఇప్పటివరకు హెడ్​ రెగ్యులేటర్​ నిర్మించకపోవడమే ఇందుకు కారణం. హెడ్​ రెగ్యులేటర్​తోపాటు ప్రొటెక్షన్​ వాల్ కూడా లేకపోవడంతో సర్జ్​పూల్​ ప్రమాదం అంచున ఉన్నట్లు ఇంజినీర్లు చెప్తున్నారు. 2004 నుంచి హెడ్​ రెగ్యులేటర్ నిర్మాణ పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా దీనిపై దృష్టిపెట్టలేదు. రెండేండ్ల  కింద ఎల్లూరు పంప్​హౌజ్​ నీట మునిగినప్పుడు హెడ్ ​రెగ్యులేటర్ ​నిర్మిస్తామని హడావిడి చేసిన సర్కారు ఆ తర్వాత పట్టించుకోలేదు. 

రెండు సార్లు మునిగినా స్పందించని సర్కారు

ఉమ్మడి పాలమూరు ​జిల్లాలోని 4.30లక్షల ఎకరాలకు సాగునీరు, 3వేలకుపైగా ఆవాసాలకు తాగునీరందించే కల్వకుర్తి లిఫ్టు స్కీమును అప్పటి కాంగ్రెస్​ సర్కారు చేపట్టింది. ఇందులో భాగంగానే ఎల్లూరు పంప్​హౌజ్​​ నిర్మించారు. అప్పటి కాంట్రాక్ట్​ సంస్థకు, సర్కారుకు నడుమ అగ్రిమెంట్​ కుదరకపోవడంతో అప్రోచ్​ కెనాల్​కు హెడ్​ రెగ్యులేటర్​ నిర్మాణం ఆపేశారు. అలా 2006లో ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు పెండింగ్​పడిన ఈ పనులను ఆ తర్వాత తెలంగాణ సర్కారు సైతం పట్టించుకోలేదు.  2014లో శ్రీశైలంకు వచ్చిన భారీ వరదల కారణంగా పంప్​హౌజ్​లోకి నీరు చేరి ఐదు మోటార్లు మునిగిపోయాయి. అప్పుడు  గేట్లు, హెడ్​ వర్క్​ ప్రపోజల్​ వచ్చినా సర్కారు పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత 2020 అక్టోబర్​లో ఎల్లూరు పంప్​హౌజ్ బేస్​మెంట్​తో సహా పగిలిపోయి నీట మునిగింది. పాలమూరు– రంగారెడ్డి అండర్​ టన్నెల్​ బ్లాస్టింగ్​వల్లే ఈ ప్రమాదం జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత అప్రోచ్​ కెనాల్​ ముందు వార్​ఫూట్​పై హెడ్​ రెగ్యులేటరీ నిర్మిస్తామని టీఆర్ఎస్​ సర్కారు  హడావుడి చేసింది. 2021 ఏప్రిల్​ లో  అప్రోచ్​ కెనాల్​లో నీరు తోడేసి  సర్జ్​పూల్​ టన్నెల్​ ముందు 95 అడుగుల ఎత్తులో ప్రొటెక్షన్​ వాల్​ నిర్మాణం, గేట్లు పెట్టాలని ఇంజనీర్లు ప్లాన్​ చేశారు. కానీ ఈలోగా వర్షాకాలం ప్రారంభమైతే కృష్ణానదికి వరదలు వస్తాయని, ఆ తర్వాత పనులు కొనసాగించలేమని వదిలేశారు. ఆ తర్వాత ఏడాది గడిచిపోయినా హెడ్​రెగ్యులేటర్​ నిర్మాణం కోసం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. 

ప్రమాదంలో పంప్​హౌజ్​

2020 అక్టోబర్​లో మూడో పంపు​ స్టార్ట్​ చేసిన ఐదు నిమిషాలకే భారీ శబ్దాలతో బేస్​ నుంచి పైకి లేచింది. ఆ వెంటనే సర్జ్​పూల్​ వెంట్​ల నుంచి దూసుకొచ్చిన నీటితో డ్యూటీలో ఉన్న సిబ్బంది చూస్తుండగానే పంప్​హౌజ్​ నీట మునిగింది. దాదాపు 35 రోజుల పాటు  డీవాటరింగ్​ చేశాక మూడో పంప్​ పూర్తిగా డ్యామేజీ అయినట్లు తేల్చారు. ఐదో పంప్​ మోటార్​ కింద  సర్జ్​పూల్​ నుంచి వచ్చే చానల్​ గేట్​ దగ్గర రంధ్రం పడినట్లు గుర్తించారు. ఒకటి, రెండు, నాలుగు పంపులను రెడీ చేసి ఒక దానిని స్టాండ్​ బైలో  ఉంచి కేవలం రెండు మోటార్లతో  నీటిని ఎత్తిపోస్తున్నారు. దెబ్బతిన్న మూడోపంపు,  వాడడానికి వీల్లేకుండా పోయిన ఐదో పంపును      వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీర్లు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. బ్లాస్టింగ్​ వల్ల  ఐదో పంపు గేట్,​ సర్జ్​పూల్​ మధ్య ఏర్పడ్డ రంధ్రాన్ని పూడ్చేందుకు దాదాపు రూ.3 కోట్ల అంచనాతో చేపట్టిన పనులు కూడా వృథా అయ్యాయి. పంప్​హౌస్​ పరిస్థితి ఇలా ఉన్న టైంలో  శ్రీశైలం రిజర్వాయర్​ 884 అడుగులకు చేరడం, కృష్ణాలో వరద ఉధృతి పెరుగుతుండడంతో ఏ చిన్న లీకేజీ మొదలైనా పంప్​హౌజ్​​ కుప్పకూలే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు.