సీజన్ ఏదైనా.. సిటీలో ఖాళీ బిందెలతో ఎదురుచూపులు

సీజన్ ఏదైనా.. సిటీలో ఖాళీ బిందెలతో ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: ఎండాకాలమే కాదు.. వర్షాకాలం, చలికాలంలోనూ గ్రేటర్ సిటీలో నీటి సమస్య తీరడం లేదు. సిటీలో అన్నిచోట్ల రోజు విడిచి రోజు నీటి సప్లయ్ చేస్తున్నామని వాటర్ ​బోర్డ్​ అధికారులు చెబుతున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చాలా కాలనీల్లో వారానికి రెండు సార్లు, కొన్నిచోట్ల ఒక్కసారి మాత్రమే నీటి సప్లయ్ జరుగుతోంది. లో ప్రెషర్ సమస్య కూడా వెంటాడుతోంది. మోటార్లు పెట్టకపోతే నీళ్లు సరిపోయే పరిస్థితి లేదని జనం వాపోతున్నారు. దీంతో కరెంట్​బిల్లులు అధికంగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ బిందెలతో నీటి కోసం మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం వాటర్ బోర్డు పరిధిలో ప్రతిరోజు 530 నుంచి 540 ఎంజీడీల(మిలియన్ గ్యాలన్ పర్ డే) నీటి డిమాండ్ ఉంది. అయితే డిమాండ్​కు సరిపడా సప్లయ్ జరగడం లేదు.

 ఫ్రీ వాటర్ స్కీమ్ అని చెప్పి..గ్రేటర్​లోని స్లమ్ ఏరియాల్లో  ఫ్రీగా 

వాటర్ సప్లయ్  చేస్తామని, అవసరమైన వారికి నల్లా కనెక్షన్లు కూడా ఇస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. అయినా కూడా నేటికి నల్లా కనెక్షన్లు లేని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కొన్ని చోట్ల ఉన్నా.. వాటికి బిల్లులు అందిస్తుండటంతో బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. కనీసం వీధి నల్లాలు కూడా లేకపోవడంతో నీటి కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జియాగూడలోని స్లమ్ ఏరియాల్లో నీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చుంటున్నామని వారు ఆవేదన 
వ్యక్తం చేస్తున్నారు.

టైమ్​కు రావట్లే.. 

నీళ్లు ఎప్పుడొస్తాయోనని చాలా ప్రాంతాల్లో  నల్లాల వద్ద జనం ఎదురు చూస్తున్నారు. షాపూర్ లోని ఇందిరానగర్​లో మూడ్రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని స్థానికులు కొద్దిరోజుల క్రితం వాటర్ బోర్డు అధికారులకు కంప్లయింట్​చేశారు. సూరారంలోని రాజీవ్ గృహకల్పలో నీటి సప్లయ్ సరిగా జరగడం లేదని అధికారులకు కంప్ల
యింట్లు అందాయి. ఇలా బోడుప్పల్, కొండాపూర్‌‌, గచ్చిబౌలి, ప్రగతినగర్‌‌, నిజాంపేట, జగద్గిరిగుట్ట, మన్సూరాబాద్, మౌలాలి, మల్కాజిగిరి, బహదూర్ పురా, సీతాఫల్ మండి, అల్వాల్,  మూసాపేట్​తదితర ప్రాంతాల్లో అరకొర నీటి సప్లయ్, లో ప్రెషర్  సమస్య నెలకొంది.

వీధి నల్లా పెడితే బాగుంటుంది

మా ప్రాంతంలో నల్లా కనెక్షన్లు లేక ఇబ్బందిగా ఉంది. ట్యాంకర్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. రోడ్డుపై రెండు వీధి నల్లాలు పెడితే ఇబ్బంది ఉండదు. నీటి సమస్యకు అధికారులు పరిష్కారం చూపాలి.- లక్ష్మి, జియాగూడ

ఎప్పుడొస్తున్నయో తెలియట్లే..

 నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. చాలా సార్లు లో ప్రెషర్​తో వస్తున్నాయి. అది కూడా కొద్దిసేపు మాత్రమే వస్తుండటంతో ఏ మాత్రం సరిపోవడంలేదు. టైమ్​కు నీటి సప్లయ్ ఉండటం లేదు.  డ్యూటీలకు వెళ్తాం కాబట్టి ఉదయమే నల్లాలను వదిలితే సమస్య ఉండదు. లో ప్రెషర్​తో వస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో మోటార్లు పెడుతున్నం. 
- వెంకటేశ్, 
జీఎస్​కాలనీ, బంజారాహిల్స్

సప్లయ్ బాగానే ఉంది

నీటి సప్లయ్ బాగానే ఉంది. ప్రస్తుతం 530 నుంచి 540 ఎంజీడీల డిమాండ్​ ఉండగా.. తగినంత నీటిని సప్లయ్ చేస్తున్నం. ఎక్కడా ఇబ్బందులు లేవు. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలి.  - రవికుమార్, వాటర్​ బోర్డ్​ డైరెక్టర్